
లక్ష్యానికి చేరలేక..
ఓబీ వెలికితీతపై వర్ష ప్రభావం
నెలలవారీగా బొగ్గు ఉత్పత్తిలో
వెనుకంజ
మణుగూరు ఏరియాలో
79 శాతమే ఉత్పత్తి
మణుగూరుటౌన్: వార్షిక బొగ్గు ఉత్పత్తి సాధనలో భాగంగా నెలల వారీగా నిర్దేశిత లక్ష్యాలు సాధించే అంశంలో ఎప్పుడూ ముందుండే మణుగూరు.. మూడు నెలలుగా కురుస్తున్న వర్షాలతో వెనుకబడింది. వర్షాలతో ఓబీ వెలికితీత, బొగ్గు ఉత్పత్తికి అంతరాయం కలుగుతోంది. అధికారులు ప్రత్యేక ప్రణాళికలు రూపొందించి ఓబీ వెలికితీతకు, బొగ్గు ఉత్పత్తికి చర్యలు చేపడుతున్నా.. అడపాదడపా కురుస్తున్న ఎడతెరిపిలేని వర్షం కారణంగా ఒక్కో సారి గనుల్లోకి కూడా వెళ్లలేని పరిస్థితి నెలకొంటోంది. ఫలితంగా ఓబీ వెలికితీతలో వెనుకంజ, బొగ్గు ఉత్పత్తిలో నెలవారీ లక్ష్యాలను సాధించలేకపోతోంది.
ఈ ఏడాది ఆగస్టు వరకే అధికం
గతేడాది ఏప్రిల్ నుంచి ఆగస్టు మాసం కంటే ఈ ఏడాది ఇప్పటివరకు కురిసిన వర్షమే అధికం. ఫలి తంగా ఓబీ వెలికితీతలో వెనుకంజలో ఉన్నా మని అధికారులు భావిస్తున్నారు. ఈ ఏడాది మణుగూ రు ఏరియాలో ఏప్రిల్ నుంచి ఆగస్టు వరకు 2,165 మి.మీ. వర్షపాతం నమోదు కాగా, గతేడాది ఆగస్టు వరకు కురిసిన వర్షాని కంటే 18శాతం ఎక్కువ ఈ ఏడాది నమోదైంది. గతేడాది ఆగస్టు వరకు 49.88 లక్షల టన్నులకు గాను 46.49 లక్షల టన్నులు 93 శాతం బొగ్గు ఉత్పత్తి సాధించింది. ఓబీ వెలికితీతలో 66 లక్షల క్యూబిక్ మీటర్లకు గాను 48.61 లక్షల క్యూబిక్ మీటర్లు వెలికితీసి 74 శాతం సాధించింది. ఈ ఏడాది ఏప్రిల్ నుంచి ఆగస్టు వరకు 44.18 లక్షల టన్నులకు గాను 45.32 బొగ్గు ఉత్పత్తి సాధించి 103 శాతం నమోదైంది. అయితే, నెలవారీగా లక్ష్యాలకు వర్షం ఆటంకం ఏర్పడినా ఇది స్టాక్ కోల్ వల్లే సాధ్యమైందని అధికార వర్గాలు చర్చించుకుంటున్నాయి. నెలల వారీగా నిర్దేశించిన ఓబీ వెలికితీత లక్ష్యాల సాధనలో ఏప్రిల్‌లో 89 శాతం ఓబీ వెలికితీయగా, మే నెలలో 81 శాతం, జూన్‌లో 86.9 శాతం, జూలైలో 60 శాతం, ఆగస్టులో 76 శాతం మాత్రమే వెలికితీశారు.
ఏరియా వెనుకంజ
మణుగూరుఏరియాలో ఆగస్టులో 7.58 లక్షల టన్నుల బొగ్గుకు గాను 5.58 లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తి(77శాతం) నమోదైందని జీఎం దుర్గం రాంచందర్ తెలిపారు. ఆయన శనివారం వివరాలు వెల్లడిస్తూ.. తీవ్ర వర్షప్రభావంతో అనుకున్న లక్ష్యా న్ని సాధించలేకపోయామని చెప్పారు. ఆగస్టులో 614 మి.మీ.వర్షపాతంతో 12 లక్షల క్యూబిక్ మీట ర్ల ఓబీ వెలికితీతకు గాను 9.10 లక్షల క్యూబిక్ మీట ర్లు వెలికితీశామన్నారు. మల్టీ డిపార్ట్‌మెంటల్ సమావేశాల ద్వారా ఉత్పత్తివ్యయం తగ్గింపు, నాణ్యమైన బొగ్గు ఉత్పత్తిపై కార్మికుల్లో అవగాహన కల్పిస్తున్నామని, యంత్రాల వినియోగం పెంచి లక్ష్యాలను సాధిస్తామని తెలిపారు. సమావేశంలో అధికారులు రమేశ్, శివప్రసాద్, రాంబాబు, శ్రీనివాస్, వీరభద్రం, రమేశ్, జ్యోతిర్మయి పాల్గొన్నారు.