
చెరువులకు జలకళ..
పాల్వంచరూరల్/అశ్వారావుపేటరూరల్: గత నాలుగైదు రోజులుగా కురుస్తున్న వర్షాలతో చెరువులు, కుంటలు, వాగుల్లోకి వరద నీరు చేరుతుండగా అన్నీ జలకళ సంతరించుకున్నాయి. జిల్లాలో మొత్తం 2,364 చెరువులు ఉండగా 877 చెరువులు ఆలుగు పోస్తున్నాయి. మరో 1,487 చెరువుల్లో 75 నుంచి 100 శాతం మేర నీరు చేరింది. పాల్వంచ మండలం రేగులగూడెంలోని ఎర్రసాని చెరువు నిండగా, మందెరకలపాడు వద్దగల రాళ్లవాగు పికప్ డ్యామ్ అలుగుపోస్తోంది. కిన్నెరసాని వాగు, సోములగూడెం, సూరారం, నాగారం వద్ద నిర్మించిన చెక్‌డ్యామ్‌లోకి వరదనీరు చేరగా పొంగిపోర్లుతున్నా యి. అశ్వారావుపేట నియోజకవర్గంలోని అశ్వారావుపేట, దమ్మపేట, అన్నపురెడ్డిపల్లి, ములకలపల్లి, చండ్రుగొండ మండలాల్లో గల చిన్న కుంటలు, చెరువులతోపాటు ప్రాజెక్టుల్లో వరదనీరు చేరగా ఆయకట్టు రైతుల్లో ఆనందం వ్యక్తం అవుతోంది. జిల్లాలో అరకొరగా నిండిన చెరువుల కింద సాగుచేసిన రైతులు పంట పూర్తయ్యే వరకు సాగునీరు అందుతుందో లేదోననే కలత చెందుతున్న తరుణంలో ఇటీవలి వానలతో చెరువులన్నీ నిండుకుండల్లా మారాయి. దీంతో ఇక పంటలకు ఢోకా లేదని చెబుతున్నారు.

చెరువులకు జలకళ..