
హాస్టల్ భోజనాన్ని పరిశీలిస్తున్న అశ్వారావుపేట ఎమ్మెల్యే జారె ఆదినారాయణ (ఫైల్)
దమ్మపేట మండలం చీపురుగూడెం బాలుర ఆశ్రమ పాఠశాల విద్యార్థులు నాసిరకమైన భోజనం పెడుతున్నారని ఆరోపించిన వీడియోలు ఈనెల 3న సోషల్ మీడియా ద్వారా వెలుగులోకి వచ్చాయి. దీంతో ఎమ్మెల్యే జారే ఆదినారాయణ తనిఖీ చేయగా కుళ్లిపోయిన టమాటాలతో కూర వండిన విషయం బయటపడింది. ఆ తర్వాత 13వ తేదీన అంకంపాలెం గిరిజన గురుకుల బాలికల కళాశాలలో తనిఖీ చేస్తే పలుకులుగా ఉన్న అన్నం, కుళ్లిపోయిన కూరగాయలను గుర్తించారు. ఐటీడీఏ పరిధి విద్యాసంస్థల్లో రాజ్యమేలుతున్న నిర్లక్ష్యానికి ఈ రెండు ఘటనలు ఉదాహరణలుగా నిలుస్తున్నాయి. – సాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం
ఆ అధికారి వల్లే అంతా...
భద్రాచలం ఐటీడీఏ పరిధిలో 50 ఆశ్రమ పాఠశాలలు, 20వసతి గృహాలు, 20 ప్రీ మెట్రిక్ వసతి గృహాలు ఉన్నాయి. గడిచిన ఏడాదిన్నర కాలంగా విద్యాసంస్థల నిర్వహణ అధ్వానంగా మారిందనే విమర్శలు వస్తున్నాయి. విద్యావ్యవస్థ గాడి తప్పడానికి ఆ శాఖలో కీలకంగా వ్యవహరిస్తున్న ఓ అఽధికారి వ్యవహర శైలే కారణమనే ఆరోపణలు వస్తున్నాయి. వ్యక్తిగత లాభమే లక్ష్యంగా సదరు అధికారి అధికారం చెలాయిస్తుండడం, ‘మనీ’ ముట్టచెబితే చాలు అక్రమాలను చూసీచూడనట్లు వదిలేసే ఆ అధికారి అక్రమాలకు అడ్డు చెప్పేవారే లేక విద్యావ్యవస్థలో ఒక్కో విభాగం నిర్వీర్యమవుతుందనే విమర్శలు వస్తున్నాయి..