
మళ్లీ మొదటి హెచ్చరిక
భద్రాచలంఅర్బన్: భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం అంతకంతకూ పెరుగుతోంది. గురువారం రాత్రి తగ్గుముఖం పట్టిన వరద శుక్రవారం తెల్ల వారుజామున ఒంటి గంటకు 36.40అడుగులుగా నమోదైంది. ఆతర్వాత ఉదయం 7గంటల వరకు తగ్గినా.. మళ్లీ పెరగడం మొదలైంది. ఉదయం 11గంటలకు 37అడుగులు, మధ్యాహ్నం ఒంటి గంటకు 38.20అడుగులు, సాయంత్రం 3గంటలకు 39.90, నాలుగు గంటలకు 40.80, 5 గంటలకు 41.50, 6 గంటలకు 42.20 అడుగులకు చేరడమే కాక రాత్రి 7–22 గంటలకు 43 అడుగులుగా నమోదు కావడంతో అధికారులు మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. ఆతర్వాత కూడా గోదావరికి వరద చేరుతూ నీటిమట్టం పెరుగుతుండగా రాత్రి 11గంటలకు 44.70 అడుగులుగా నమోదైంది. అయితే, గురువారం వరద తగ్గుముఖం పట్టడంతో ఏజెన్సీ ప్రజలు ఊపిరి పీల్చుకుంటుండగానే మళ్లీ పెరుగుతుండడంతో ఎప్పుడేం జరుగుతోందనని ఆందోళనకు గురవుతున్నారు.
బయటకు రావొద్దు
గోదావరికి వరద పెరుగుతున్న నేపథ్యాన వరద ప్రభావిత ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉంటూ అవసరమైతేనే తప్ప బయటకి రావొద్దని అధికారులు సూచించారు. సమస్య ఎదురైతే డయల్ 100కు లేదా కంట్రోల్ రూమ్‌కు ఫోన్ చేయాలని అధికారులు తెలిపారు. అలాగే, కరకట్ట ప్రాంతంలో భక్తులు, స్థానికులు నదిలోకి వెళ్లకుండా మైక్ ద్వారా సిబ్బంది ప్రచారం చేస్తున్నారు.
భద్రాచలంలో పెరుగుతున్న గోదావరి