
ఆలయ అభివృద్ధి, భక్తులకు సేవలు
ఈఓగా బాధ్యతలు స్వీకరించిన
దామోదర్‌రావు
భద్రాచలం: శ్రీ సీతారామ చంద్రస్వామి దేవస్థానం అభివృద్ధికి కృషి చేస్తానని నూతన ఈఓ దామోదర్‌రావు తెలిపారు. ఇదే సమయాన భక్తులకు మెరుగైన సేవలు అందించడంపై దృష్టి సారిస్తానని వెల్ల డించారు. ఈఓగా శుక్రవారం ఆయన బాధ్యతలు స్వీకరించగా.. తొలుత ఆలయ ప్రదక్షిణ అనంతరం అంతరాలయంలో మూలమూర్తులను దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఉపాలయంలో పండితులు వేదాశీర్వచనం చేసి స్వామి వారి ప్రసాదాలు అందజేశారు. అనంతరం కార్యాలయంలో బాధ్యతలు చేపట్టిన దామోదర్‌రావు మాట్లాడారు. భద్రాచలం ఆర్‌డీఓగా పని చేసిన అనుభవం ఉందని, ఇటీవల మాడ వీధుల విస్తరణలో భూసేకరణ చేసినట్లు తెలిపారు. ఆలయంలో వైదిక కమిటీ, అర్చకులు, పండితులను సమన్వయం చేసుకుంటూ ముందుకు సాగుతానని వెల్లడించారు. ఆలయ అభివృద్ధికి తగిన ప్రతిపాదనలను రూపొందించి అమలయ్యేలా కృషి చేస్తానని తెలిపారు. కాగా, నిత్యాన్నదానానికి సంబంధించి బ్యాంకులో డిపాజిట్ రూ.70 లక్షలు చేసే పత్రంపై దామోదర్‌రావు తొలి సంతకం చేశారు. ఆలయ ఏఈఓ భవానీ రామకృష్ణ, ప్రధాన అర్చకులు సీతారామానుజాచార్యులుతో పాటు ఉద్యోగులు, అర్చకులు ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు.