
ఇంకా సాధారణమే..
జిల్లాలోని 11 మండలాల్లోనే
అధిక వర్షపాతం
మిగతా అన్నిచోట్ల అంతంతే..
సరాసరి వర్షపాతం 32.9 మి.మీ.గా నమోదు
చివరి దశలో పంటల సాగు
సూపర్‌బజార్(కొత్తగూడెం): వర్షాలు దంచి కొడుతున్నా జిల్లాలో ఇప్పటి వరకు సాధారణ వర్షపాతమే నమోదైంది. ఈ వర్షాకాలం వర్షాలు ఆశించినస్థాయిలో కురవలేదు. అయినప్పటికీ వాయుగుండాల కారణంగా వర్షాలు కురుస్తుండడంతో ఆమా త్రం అయినా వర్షపాతం నమోదైందని గణాంకాలు చెబుతున్నాయి. జూన్‌లో సాధారణ వర్షపాతం 169.1 మి.మీ.కు గాను 134.4 మి.మీ.గా నమోదవడంతో 20.5లోటు ఏర్పడింది. ఇక జూలైలో సాధారణ వర్షపాతం 312.7 మి.మీ.కు 378.9 మి.మీ కురిసి 21.2శాతం అధికవర్షపాతం నమో దైంది. అలాగే, ఈనెల ఇప్పటి వరకు 269 మి.మీ. వర్షపాతం నమోదుకావాల్సి ఉండగా 369.9 మి.మీ గా కురవడంతో 30.1 శాతం అధిక వర్షపాతం నమోదైంది. మొత్తంగా జిల్లాలోని 23 మండలాల్లో సరాసరి 15మి.మీ. వర్షపాతం నమోదైందని గణాంకాలు చెబుతున్నాయి.
ఒకేరోజు 32.9 మి.మీ.
దాదాపు జిల్లా అంతటా గురువారం వర్షం కురిసింది. దీంతో జిల్లా సగటు 32.9 మి.మీ.గా నమోదైంది. అధికంగా జూలూరుపాడులో 73.2 మి.మీ., దమ్మపేట మండలంలో 67.6మి.మీ, అన్నపురెడ్డిపల్లి మండలంలో 62.6మి.మీ., ములకలపల్లి మండలంలో 62.4 మి.మీ., చండ్రుగొండ మండలంలో 66.2 మి.మీ., లక్ష్మీదేవిపల్లి మండలంలో 38.8 మి.మీ., టేకులపల్లి మండలంలో 38.4 మి.మీ., కొత్తగూడెంలో 36.4 మి.మీ., సుజాతనగర్ మండలంలో 35.6 మి.మీ., అశ్వారావుపేట మండలంలో 34 మి.మీ., పాల్వంచ మండలంలో 33.6 మి. మీ., ఇల్లెందు మండలంలో 30.6 మి.మీ., గుండా ల మండలంలో 28.4 మి.మీ., చుంచుపల్లి మండ లంలో 24.8 మి.మీ.తో పాటు కరకగూడెం మండ లంలో 24.4 మి.మీ. వర్షపాతం నమోదైంది. ఇతర మండలాల్లో వర్షప్రభావం ఉంది.
11 మండలాల్లో అధికం..
జూన్ 1వ తేదీ నుంచి జిల్లాలోని 11 మండలాల్లో ఇప్పటివరకు అధికవర్షపాతం నమోదైంది. ఈ జాబితాలో మణుగూరు, ఇల్లెందు, టేకులపల్లి, జూలూరుపాడు, చండ్రుగొండ, చుంచుపల్లి, సుజాతనగర్, కొత్తగూడెం, పాల్వంచ, బూర్గంపాడు, అశ్వారావుపేట మండలాలు ఉన్నాయి. అలాగే, కరకగూడెం, పినపాక, చర్ల, దుమ్ముగూడెం, అశ్వాపు రం, ఆళ్లపల్లి, గుండాల, అన్నపురెడ్డిపల్లి, లక్ష్మీదేవిపల్లి, భద్రాచలం, ములకలపల్లి, దమ్మపేట మండలాల్లో ఇప్పటికీ సాధారణ వర్షపాతమే నమోదైంది.
వరి, మిర్చి మినహా..
ఈ వానాకాలంలో జిల్లాలో అన్ని పంటలు కలిపి 5,91,714ఎకరాల్లో సాగవుతాయని అధికారులు అంచనా వేశారు. అయితే, సీజన్ ప్రారంభంలో వర్షాలు మందకొడిగా ఉండడంతో సాగు నెమ్మదిగా మొదలైంది. ఆ తర్వాత వర్షాల ఆధారంగా పంటల సాగు క్రమంగా పెరుగుతూ వచ్చింది. ఇప్పటికే సాధారణ విస్తీర్ణం కంటే 8,859 ఎకరాల మేర ఎక్కువగా పంటలు సాగు చేయగా.. మొత్తం 6,00,673 ఎకరాల్లో సాగైనట్లు అధికారులు గుర్తించారు. వరి సాధారణం కంటే 13,906 ఎకరాల్లో ఇంకా నాట్లు వేయాల్సి ఉంది. అలాగే, మిర్చి సాధారణ విస్తీర్ణంతో పోలిస్తే 10,283 ఎకరాల్లో ఇంకా పంట మొదలుకాలేదు. మిగతావన్నీ అంచనాల కంటే ఎక్కువ విస్తీర్ణంలో సాగయ్యాయని అధికారులు చెబుతున్నారు.