
యూరియా కోసం అవస్థలు
ఇల్లెందురూరల్: మండలంలో యూరియా విక్రయం కోసం పీఏసీఎస్ ఆధ్వర్యంలో మూడు విక్రయ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ప్రతీ రోజు విక్రయ కేంద్రం వద్ద వందల సంఖ్యలో రైతులు యూరియా కావాలంటూ బారులు తీరుతున్నారు. ఇప్పటివరకు ఆదార్‌కార్డు ఆధారంగా యూరియా విక్రయించిన అధికారులు రద్దీ అధికం కావడంతో పట్టాదారు పాస్‌పుస్తకం జిరాక్స్ చూపిస్తేనే పంపిణీ చేస్తామని శుక్రవారం నిజాంపేట విక్రయ కేంద్రం వద్ద షరతు పెట్టారు. ఈ విషయంలో రెండు రోజులుగా పట్టాదారు పాస్‌పుస్తకాలు లేని రైతులు విక్రయ కేంద్రాల వద్ద నిరసన వ్యక్తం చేస్తూనే ఉన్నారు. రైతుల సంఖ్యకు అనుగుణంగా యూరి యా స్టాక్ లేకపోవడంతో ముందుగా రైతుల వద్ద ఉన్న ఆధారాలను పరిశీలించి టోకెన్‌లను అందజేస్తున్నారు. ఈ సమయంలో ఎలాంటి ఘర్షణ చోటు చేసుకోకుండా ఇల్లెందు సీఐ సురేశ్ బందో బస్తు నిర్వహించారు. మధ్యాహ్నం తరువాత పోలీస్‌పహారాలో టోకెన్ నంబర్ల వారీగా పిలిచి యూరియా విక్రయాలు చేపట్టారు. తెల్లవారు జామునే విక్రయ కేంద్రం వద్దకు చేరుకున్న రైతులు ఒక్క బస్తా కోసం క్యూౖ లెన్లో నిలబడి ఆధారాలు అందజేసి టోకెన్ అందితే మధ్యాహ్నంతరువాత యూరియా తీసుకుంటున్నారు.
ఇరు వర్గాల మధ్య దాడులు
పాల్వంచ: స్థానిక కోఆపరేటివ్ సొసైటీ కార్యాలయం యూరియా పంపిణీ కేంద్రం వద్ద ఇరువర్గాలు ఒకరిపై ఒకరు దాడులకు పాల్పడ్డారు. యూరియా బస్తాలను ఆటోల్లో పంపిస్తుండగా కోడిపుంజుల వాగు పూసలతండాకు చెందిన ఓ మహిళకు, హమాలీలకు మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. మహిళా రైతు తొలుత హమాలీపై చేయిచేసుకోగా, ఆటోడ్రైవర్ ఘర్షణకు దిగాడు. హమాలీ ముఠా సభ్యులు భారీసంఖ్యలో అక్కడికి చేరుకుని తిరిగి మహిళ, ఆటోడ్రైవర్‌పై దాడికి పాల్పడ్డాడు. దీంతో ఆటోడ్రైవర్ అంబేడ్కర్‌సెంటర్‌వైపు పరుగులు తీయగా, వెంటపడి హమాలీలు దాడికి పాల్పడ్డారు. పోలీస్ సిబ్బంది అడ్డుకునే ప్రయత్నం చేసినా ఫలించలేదు. ఈ విషయమై ఎస్‌ఐ సుమన్‌ను వివరణ కోరగా హమాలీలు ఫిర్యాదు చేశారని, బస్తాలు వేసి డబ్బులు ఇవ్వకుండానే ఆటో తీసుకెళ్తుండగా అడిగినందుకు దాడి చేశారని వెల్లడించారు.

యూరియా కోసం అవస్థలు