
ఆర్‌ఎంపీ నిర్వాకం..
అశ్వారావుపేట: అశ్వారావుపేటకు చెందిన ఓ ఆర్‌ఎంపీ మిడిమిడి జ్ఞానం.. ఖమ్మంలోని డయాగ్నస్టిక్ సెంటర్, ఓ ఆస్పత్రితో కమీషన్ల కక్కుర్తి వెరసి ఓ ఇమామ్(ముస్లిం మత గురువు) ప్రాణాపాయ స్థితికి చేరాడు. అశ్వారావుపేట బీసీ కాలనీ మసీద్ ఇమామ్ షేక్ హసాన్ సాలెం హష్మీ వారం క్రితం గ్యాస్ సమస్యతో నొప్పిగా ఉందని స్థానిక ఆర్‌ఎంపీ వద్దకు వెళ్లాడు. రెండు ఇంజక్షన్లు చేశాక సత్తుపల్లిలోని స్కానింగ్ సెంటర్‌కు పంపించి వైద్యం చేయించినా ఫలితం కానరాలేదు. తిరిగి అశ్వారావుపేట ప్రభుత్వాస్పత్రిలో పరీక్షించగా స్కానింగ్ కోసం ఖమ్మం ప్రభుత్వాస్పత్రికి రిఫర్ చేశారు. అయితే, ఖమ్మంలో ప్రభుత్వ ఆస్పత్రికి వెళ్లనివ్వకుండా ఆర్‌ఎంపీకి పరిచయం ఉన్న ఓ డాక్టర్, డయాగ్నోస్టిక్ సెంటర్‌లో పరీక్షలు, వైద్యం చేయించేలోగా దాచుకున్న డబ్బంతా ఖర్చయింది. అయినా పరిస్థితి మెరుగపడకపోవడంతో ఖమ్మంలోని ప్రైవేట్ ఆస్పత్రిలో చేరేసరికి ప్లేట్‌లెట్లు 10వేలకు పడిపోయాయని, శరీరంలో అంతర్గతంగా రక్తస్రావం అవుతోందని తేల్చారు. చికిత్సకు రూ.లక్షల్లోనే ఖర్చవుతుందని చెప్పడంతో షేక్ హసాన్ దాతల చేయూత కోసం ఎదురుచూస్తున్నారు. అశ్వారావుపేట రింగ్ సెంటర్‌లో రోడ్డు పక్కన టిఫిన్ అమ్మే మాబు కుమారుడు ఈయన చికిత్స కోసం దాతలు చూయూతనివ్వాలని పలువురు కోరుతున్నారు. కాగా, దాతలు 96760 81119(షేక్ షరీఫ్ అహ్మద్) నంబర్‌కు ఫోన్ పే ద్వారా సాయం అందించాలని విజ్ఞప్తి చేస్తున్నారు.
ప్రాణాపాయ స్థితిలో ఇమామ్