
మనం భద్రమేనా?!
జాగ్రత్త పడాల్సిందే
‘క్లౌడ్ బరస్ట్’ అయితే జిల్లా అల్లకల్లోలమే చిన్నపాటి వానకే వణికిపోతున్న పట్టణాలు వరద నిర్వహణకు కొత్త మాడ్యూల్ తప్పనిసరి
సాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం: వానాకాలంలో వర్షాలు, వరదల తీరుతెన్నుల్లో కొన్నేళ్లుగా తేడాలు కనిపిస్తున్నాయి. తుపాన్ ప్రభావంతో మబ్బులు ముసురుకుని గంటల తరబడి కురిసే వర్షాలకు బదులు ఆకాశం బద్దలైనట్టు కుండపోత వాన కురవడం ఎక్కువైంది. 30 చదరపు కి.మీ. ప్రదేశంలో 24 గంటల వ్యవధిలో 10 సెం.మీ. కంటే ఎక్కువ వర్షం కురిస్తే దాన్ని క్లౌడ్‌బరస్ట్‌గా పేర్కొంటారు. ఈ తరహా పరిస్థితి తలెత్తితే ఒక్కసారిగా వరద ఊరూవాడ, పొలం చెలక తేడా లేకుండా అంతా కమ్మేస్తుంది. కేవలం పది సెం.మీ. మీటర్ల వర్షానికే పరిస్థితులు ఇంత భయానకంగా మారతాయనుకుంటే.. గడిచిన నాలుగైదేళ్లుగా క్లౌడ్ బరస్ట్ కారణంగా 30 సెం.మీ.కు తక్కువ కాకుండా వర్షం కురుస్తోంది. ఏటా ఒక జిల్లా క్లౌడ్ బరస్ట్ కారణంగా చిగురాటకులా వణికిపోతున్న నేపథ్యాన జిల్లాలో ఈ పరిస్థితితో తట్టుకోవడం సాధ్యమేనా అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
మనకు మరింతగా
రాష్ట్రంలోనే అత్యధిక అడవులు ఉన్న జిల్లాగా భద్రాద్రి కొత్తగూడెంకు గుర్తింపు ఉంది. జిల్లాలో ఎక్కువ ప్రాంతం కొండలు, గుట్టలతో నిండి ఉంటుంది. సముద్ర మట్టానికి తక్కువ ఎత్తులో ఉంది. దీంతో ఇక్కడ క్లౌడ్ బరస్ట్ తరహా వర్షాలు వస్తే పరిస్థితి క్షణాల్లోనే బీతావహంగా మారే ప్రమాదముంది. గతంలో 2005లో దమ్మపేట మండలంలో 40 సెం.మీ. వర్షపాతం నమోదవగా 2013లో వాజేడు మండలంలో 53 సెం.మీ. వర్షపాతం నమోదైంది. నిన్నామొన్నటి వరకు తెలంగాణలో ఇదే అత్యధిక వర్షపాతంగా రికార్డు ఉండేది. అయితే 2023లో ములుగు జిల్లా వెంకటాపురం మండలంలో 64 సె.మీ. వర్షపాతం కురవగా కొత్త రికార్డు నమోదైంది. గత క్లౌడ్‌బరస్ట్ బాధిత జాబితాలో మణుగూరు, అశ్వారావుపేట మండలాలు చేరాయి.
మోగిన ప్రమాద ఘంటికలు
గతేడాది ఆగస్టు 31 రాత్రి మణుగూరులో 31 సెం.మీ. వర్షం కురవడంతో కట్టవాగు ఉప్పొంగింది. గంటల వ్యవధిలో పట్టణంలో సగం మేర ముంపునకు గురైంది. ఈ వరద తీవ్రత నుంచి తప్పించుకోలేక ఒక దివ్యాంగుడు ప్రాణాలు కోల్పోయాడు. అంతకు ముందు జూలై 18న జిల్లా సరిహద్దు ఏపీలోని గుబ్బల మంగమ్మ గుట్టల మీద 27 సెం.మీ. భారీ వర్షపాతం నమోదైంది. దీంతో దిగువన అశ్వారావుపేట మండలంలో పెద్దవాగుకు వరద పోటెత్తింది. చూస్తుండగానే పరీవాహక ప్రాంతాలను ముంచెత్తగా పొలాల్లోని రైతులు, వివిధ పనులపై బయటకు వచ్చిన వారు వరదలో చిక్కుకుపోయారు. అదృష్టవశాత్తు చీకటి పడే సమయానికి హెలీకాప్టర్లతో రెస్క్యూ ఆపరేషన్ మొదలవడంతో వారంతా ప్రాణాలతో బయటపడ్డారు. ప్రాణనష్టం తప్పినా వరద తీవ్రతకు పెద్ద వాగు ప్రాజెక్టు కొట్టుకుపోయింది. ఫలితంగా ప్రాజెక్టు దిగువన ఏపీలో ఉన్న వేలేరుపాడు మండలం అతలాకుతలమైంది.
జిల్లా కేంద్రమైన కొత్తగూడెం మీదుగా ముర్రేడు, గోధుమ వాగు వెళ్తున్నాయి. ఈ వాగు ఉధృతికి ఏటా గట్టుపై ఉన్న ఇళ్లు కూలిపోతున్నాయి. వాగుకు రక్షణగా గేబియన్ వాల్ నిర్మించాలని రెండేళ్లుగా చేస్తున్న ప్రయత్నాలు ముందుకు సాగడం లేదు. గోధుమవాగు కారణంగా విద్యానగర్, బైపాస్ రోడ్డు ప్రాంతాలకు ముంపు పొంచి ఉంది. ఈ వాగు అంచు వెంట పెరిగిన చెట్లు, ముళ్ల కంపలు భారీ ప్రవాహానికి అడ్డుగా మారే అవకాశం ఉంది. వాగు వెంట జంగిల్ క్లియరెన్స్ చేపట్టాల్సి ఉన్నా పట్టించుకోవడం లేదు. పాల్వంచలోని దమ్మపేట రోడ్డులో లోతట్టు ప్రాంతాల్లో డ్రెయినేజీలు మెరుగుపర్చాలి. అలాగే, వచ్చే సీజన్ నాటికై నా బుగ్గవాగుకు రక్షణ గోడ నిర్మిస్తే ఇల్లెందుకు వరద ముప్పు తప్పుతుంది. గతేడాది వరదల దృష్ట్యా మణుగూరులో కట్టవాగుకు పూడికతీత పనులు చేసినా ఆశించిన స్థాయిలో ఫలితం స్థానికులు చెబుతున్నారు. క్లౌడ్‌బరస్ట్ తరహా పరిస్థితులు ఎదురైనా వరద సాఫీగా సాగేలా పనులు చేపట్టాలని డిమాండ్ చేస్తున్నారు. ఇవికాక పల్లెలు, పట్టణాల్లో వరద నీటి నిర్వహణ పద్ధతులకు మెరుగుపెట్టకపోతే జనం ఆందోళనగా గడపాల్సిన పరిస్థితులు ఎదురవుతాయి.
జిల్లావాసులను వెంటాడుతున్న వరద భయం

మనం భద్రమేనా?!