భద్రాచలం: భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి వారి నిత్యకల్యాణ వేడుక గురువారం సుమనోహరంగా సాగింది. తెల్లవారుజామున గర్భగుడిలో స్వామికి సుప్రభాత సేవ, సేవా కాలం, ఆరాధన తదితర పూజలు చేశారు. అనంతరం బేడా మండపంలో కొలువుదీర్చి విశ్వక్సేన పూజ, పుణ్యావాచనం చేశారు. స్వామి వారికి కంకణధారణ, యజ్ఞోపవీత ధారణ, అమ్మవారికి కంకణధారణ, యోక్త్రధారణ గావించిన అర్చకులు నిత్యకల్యాణ ఘట్టాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు.
స్వామి వారి పూజలకు విరాళం
శ్రీ సీతారామ చంద్రస్వామి దేవస్థానంలో వివిధ పూజల నిమిత్తం హైదరాబాద్ కూకట్‌పల్లిలోని వివేకానంద నగర్‌కు చెందిన నాయినేని కృష్ణారావు – కౌసల్య దంపతులు గురువారం రూ.3.52లక్షలు అందజేశారు. అనంతరం దాతలు స్వామిని దర్శించుకోగా, వారికి ఈఓ రమాదేవి రశీదు అందజేశారు.
పెద్దమ్మతల్లికి సువర్ణ పుష్పార్చన
పాల్వంచరూరల్: మండలంలోని కేశవాపురం – జగన్నాఽథపురం మధ్య కొలువైన శ్రీకనకదుర్గ(పెద్దమ్మతల్లి) ఆలయంలో గురువారం అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అమ్మవారికి 108 సువర్ణ పుష్పాలతో అర్చన, హారతి, మంత్రపుష్పం, నివేదన పూజలు జరిపారు. ఈఓ ఎన్.రజనీకుమారి, ఆలయ కమిటీ చైర్మన్ బాలినేని నాగేశ్వరరావు, అర్చకులు, వేదపండితులు పద్మనాభశర్మ, రవికుమార్‌శర్మ తదితరులు పాల్గొన్నారు
సింగరేణిలో 18 మంది వైద్యుల బదిలీ
సింగరేణి(కొత్తగూడెం): సింగరేణి వ్యాప్తంగా పలువురు వైద్యులను బదిలీ చేస్తూ కార్పొరేట్ ఈఈ సెల్ హెచ్‌ఓడీ ఏ.జే.మురళీధర్‌రావు బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఇందులో ఆరుగురు డీవైసీఎంఓలు, ఏడుగురు మెడికల్ సూపరింటెండెంట్లు, ముగ్గురు డిప్యూటీలు, ఇద్దరు సీనియర్ మెడికల్ సూపరింటెండెంట్లు ఉన్నారు. వీరంతా నూతన స్థానాల్లో వెంటనే రిపోర్టు చేయాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
లోక్ అదాలత్‌ను సద్వినియోగం చేసుకోండి
కొత్తగూడెంటౌన్: వచ్చేనెల 13న జరగనున్న జాతీయ లోక్ అదాలత్‌ను కక్షిదారులు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి ఎం.రాజేందర్ సూచించారు. కొత్తగూడెం జిల్లా కోర్టు హాల్‌లో గురువారం కోర్టు కానిస్టేబుళ్లతో సమావేశమైన ఆయన మాట్లాడారు. రాజీ పడదగిన పెండింగ్ కేసులు అత్యధికంగా పరిష్కారమయ్యేలా కక్షిదారులకు అవగాహన కల్పించాలని తెలిపారు. అందరూ సమన్వయంతో పనిచేస్తే కేసులు ఎక్కువగా పరిష్కారమవుతాయని వెల్లడించారు. ఈ సమావేశంలో సెకండ్ క్లాస్ మేజిస్ట్రేట్ మెండు రాజమల్లు, లైజన్ ఆఫీసర్ ఘని, కానిస్టేబుళ్లు పాల్గొన్నారు.
22 నుంచి డీఈఐఈడీ పరీక్షలు
కొత్తగూడెంఅర్బన్: వచ్చే నెల 22 నుంచి డిప్లొ మా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ ద్వితీయ సంవత్సరం థియరీ పరీక్షలు జరగనున్నాయని డీఈఓ నాగలక్ష్మి తెలిపారు. పరీక్షలు నిర్ణీత తేదీల్లో ఉదయం 9నుంచి 12 గంటల వరకు జరుగుతాయని వెల్లడించారు. అలాగే, తెలంగాణ ఓపెన్ స్కూల్ సొసైటీ సప్లిమెంటరీ పరీక్ష ల షెడ్యూల్ కూడా విడుదలైందని తెలిపారు. పూర్తి వివరాల కోసం పరీక్షల సహాయక కమిషనర్ ఎస్.మాధవరావు(89192 79238)ను సంప్రదించాలని డీఈఓ సూచించారు.