
పెరిగి.. తగ్గిన గోదావరి
భద్రాచలం: భద్రాచలం వద్ద గోదావరి మళ్లీ క్రమంగా పెరిగినట్లే పెరిగి రాత్రికి తగ్గుముఖం పట్టింది. నాలుగు రోజుల క్రితం మూడో ప్రమాద హెచ్చరిక సమీపానికి వచ్చిన వరద ఆ వెంటనే తగ్గిపోయింది. దీంతో ఏజెన్సీ వాసులు ఊపిరి పీల్చుకోగా ఇప్పుడు మళ్లీ ఆందోళనకు గురవుతున్నారు. భద్రాచలానికి ఎగువ ప్రాంతాల్లో రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలతో గోదావరికి భారీ వరద చేరుకుంది. అంతేకాక తాలిపేరు ప్రాజెక్టు గేట్లన్నీ తెరిచారు. ఛత్తీస్‌గఢ్‌లో వర్షాలతో దిగువన శబరికి నీరు చేరగా వరద పోటెత్తింది. దీంతో గోదావరి మరింత పెరుగుతుందనే అంచనాతో అధికారులు పరీవాహక ప్రాంత ప్రజలను అప్రమత్తం చేశారు. ప్రజలు అత్యవసర పరిస్థితుల్లో డయల్ 100కు ఫోన్ చేయాలని ఎస్పీ రోహిత్‌రాజ్ సూచించారు. తప్పనిసరైతే తప్ప ఎవరూ బయటకు రావొద్దని, గోదావరితో పాటు ఇతర జలవనరుల వద్ద వీడియోలు, సెల్ఫీల కోసం వెళ్లి ప్రమాదాల బారిన పడొద్దని తెలిపారు.
పెరిగి.. మళ్లీ తగ్గి
గురువారం తెల్లవారుజామున 4గంటలకు 29 అడుగులు ఉన్న గోదావరి అనంతరం వేగంగా పెరిగింది. ఉదయం 9గంటలకు 35.80అడుగులకు చేరగా 11గంటలకు 36.90 అడుగులుగా నమోదైంది. ఆతర్వాత నెమ్మదిగా పెరిగిన గోదావరి సాయంత్రం 5గంటలకు 38.60 చేరి, 6గంటలకు కూడా అదేస్థాయిలో ఉండగా.. రాత్రి 10 గంటలకు 37.50అడుగులకు పడిపోయింది. ఉదయమే స్నానఘాట్లు నీటమునగగా గజ ఈతగాళ్లు, లాంచీలను సిద్ధం చేశారు.
● దుమ్ముగూడెం: దుమ్ముగూడెం మండలంలో గోదావరి పరవళ్లతో పర్ణశాల వద్ద నారచీరల ప్రాంతం నీట మునిగింది. గుబ్బలమంగి వాగు ప్రాజెక్టు, తులసమ్మ, గంగోలు చెరువులు నిండుగా ప్రవహిస్తున్నాయి. సున్నంబట్టి–బైరాగులపాడు మధ్య రహదారిపైకి వరద చేరింది.
ఎగువన వర్షాలతో భారీ వరద

పెరిగి.. తగ్గిన గోదావరి