
‘స్థానిక’ ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌దే విజయం
వచ్చే నెల 10, 11వ తేదీల్లో కేటీఆర్ పర్యటన
రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర
సూపర్‌బజార్(కొత్తగూడెం): ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లో తీసుకెళ్లేలా బీఆర్‌ఎస్ శ్రేణులు కృషి చేయాలని, తద్వారా స్థానిక సంస్థల ఎన్నికల్లో సులువుగా విజయం సాధించొచ్చని రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర తెలిపారు. కాగా, వచ్చే నెల 10, 11వ తేదీల్లో బీఆర్‌ఎస్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ జిల్లా పర్యటనను విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. కొత్తగూడెంలోని బీఆర్‌ఎస్ జిల్లా కార్యాలయంలో జిల్లా అధ్యక్షుడు రేగా కాంతారావు అధ్యక్షతన గురువారం జరిగిన జిల్లా స్థాయి సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో కాంగ్రెస్, బీజేపీకి ఎనిమిది మంది చొప్పున ఎంపీలు ఉన్నా యూరియా కొరతను తీర్చలేకపోతున్నారని ఆరోపించారు. కాంగ్రెస్ పాలనలో రాష్ట్రం తిరోగమన దిశలో పయనిస్తోందని దుయ్యబట్టారు. భద్రాచలం నుంచి బీఆర్‌ఎస్ తరఫున గెలిచిన తెల్లం వెంకట్రావు ఆతర్వాత కాంగ్రెస్‌లో చేరగా, స్పీకర్ నోటీసులు ఇవ్వగానే పార్టీ మారలేదని చెప్పడం గర్హనీయమని తెలిపారు. బీసీలను రిజర్వేషన్ల పేరుతో కాంగ్రెస్ మోసం చేసే ప్రయత్నాలు మొదలుపెట్టిందని చెప్పారు. కాగా, కేటీఆర్ జిల్లా పర్యటన పార్టీ శ్రేణులకు రీచార్జ్‌లా ఉంటుందని తెలిపారు. ఎమ్మెల్సీ తాతా మధుసూదన్ మాట్లాడగా, జిల్లా అధ్యక్షుడు రేగా కాంతారావు మాట్లాడుతూ పార్టీ సంస్థాగత ఎన్నికలను త్వరలో పూర్తి చేస్తామని తెలిపారు. కేటీఆర్ జిల్లా పర్యటనలో భాగంగా కొత్తగూడెం, పినపాక, భద్రాచలం నియోజకవర్గాల్లో పర్యటిస్తారని వివరించారు. మాజీ మంత్రి వనమా వెంకటేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యేలు బానోత్ హరిప్రియ, మెచ్చా నాగేశ్వరరావు, గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ దిండిగాల రాజేందర్, నాయకులు రామకృష్ణ, రావులపల్లి రాంప్రసాద్, కాపు సీతాలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. కాగా, కొత్తగూడెం బాబుక్యాంపు వద్ద ప్రతిష్ఠించిన గణనాధుడిని రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర దర్శించుకుని పూజలు చేశారు. ఎమ్మెల్సీ తాతా మధుతో పాటు దిండిగాల రాజేందర్, కాపు సీతాలక్ష్మి, బాదావత్ శాంతి, అనుదీప్, నవతన్, శ్రీకాంత్, కన్నీ, రమాకాంత్ పాల్గొన్నారు. అలాగే, కొత్తగూడెంలో సమావేశం ముగించుకుని ఖమ్మం వెళ్లే క్రమాన మార్గమధ్యలో రహదారిపై పెద్దసంఖ్యలో కోతులు కనిపించడంతో ఎంపీ రవిచంద్ర తదితరులు అరటి పండ్లు వేసి వాటి ఆకలి తీర్చారు.