
అవగాహన కోసం ‘డెమో ఫామ్’
● మోరంపల్లి బంజరలో ఏర్పాటుకు సన్నాహాలు ● పరిశీలించిన కలెక్టర్ జితేష్ వి.పాటిల్
బూర్గంపాడు: జిల్లా ప్రజల ఆదాయం పెంచడం, ఉపాధి అవకాశాలు మెరుగుపరిచేలా అవగాహన కల్పించేందుకు మోడల్ డెమో ఫామ్ ఏర్పాటుచేయనున్నట్లు కలెక్టర్ జితేష్ వి. పాటిల్ తెలిపారు. మండలంలోని మోరంపల్లిబంజర సమీపాన సీతారామ కెనాల్ పక్కన ఇరిగేషన్‌శాఖ భూమిలో మోడల్ డెమో ఫామ్ నిర్మాణానికి గురువారం ఆయన పరిశీలించి మాట్లాడారు. ఈ స్థలంలో కూరగాయల సాగు, మట్టి ఇటుకల తయారీ యూనిట్, వెదురు, వాక్కాయ కంచె ఏర్పాటుచేయడంతో పాటు మునగసాగు చేపట్టాలని సూచించారు. తద్వారా రైతులు, మహిళలకు నూతన వ్యవసాయ సాగు విధానాలపై అవగాహన కల్పించొచ్చని తెలిపారు. తహసీల్దార్ కేఆర్‌కేవీ.ప్రసాద్, ఎంపీఓ బాలయ్య, ఆర్‌ఐ నర్సింహారావు, ఏఈ సందీప్, ఏపీఓ విజయలక్ష్మి, ఏపీఎం నందిని, పంచాయతీ కార్యదర్శి భవాని, ఏఓ నాగార్జున పాల్గొన్నారు.
నాణ్యమైన ఇటుకల తయారీ
మణుగూరు రూరల్: ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం, ఉపాధి హామీ పథకం పనులను నాణ్యమైన ఇటుకలు అందించేలా చర్యలు చేపడుతున్నట్లు కలెక్టర్ పాటిల్ తెలిపారు. మణుగూరు మండలం చిక్కుడుగుంట ప్రాంతంలోని బీటీపీఎస్ సమీపాన ఫ్లైయాష్‌తో ఇటుకల తయారీని పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఈనెల 30న నాణ్యమైన ఇటుకల తయారీపై శిక్షణ ఇప్పిస్తామని చెప్పారు. బీటీపీఎస్ సీఈ బి.బిచ్చన్న, తహసీల్దార్ అద్దంకి నరేష్, ఎంపీడీఓ టి.శ్రీనివాసరావు, ఎంపీఓ పి వెంకటేశ్వరరావు పాల్గొన్నారు.
దివ్యాంగుల నిర్ధారణ క్యాంపులు
కొత్తగూడెంఅర్బన్: దివ్యాంగుల నిర్ధారణకు నిర్వహించే క్యాంపులను సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ జితేష్ వి.పాటిల్ సూచించారు. దివ్యాంగుల వైకల్య శాతాన్ని నిర్ధారించి ఉపకరణాలు అందించేందుకు ఏర్పాటుచేసే శిబిరం బ్రోచర్లను ఆయన ఆవిష్కరించి మాట్లాడారు. పాత కొత్తగూడెంలోని జెడ్పీహెచ్‌ఎస్(ఆనందఖని పాఠశాల)లో ఈనెల 30, సెప్టెంబర్ 1, 2వ తేదీల్లో జరిగే శిబిరాలకు దివ్యాంగ బాలలు, తల్లిదండ్రులు హాజరుకావాలని తెలిపారు. ఈ విషయమై ఉపాధ్యాయులు అవగాహన కల్పిస్తూ, వివరాలకు జిల్లా సమ్మిళిత విద్యా కోఆర్డినేటర్ ఎస్.కే.సైదులు(98487 86166)ను సంప్రదించేలా వివరించాలన్నారు. డీఈఓ బి.నాగలక్ష్మి, అధికారులు సైదులు, నాగరాజశేఖర్, సతీష్‌కుమార్ పాల్గొన్నారు.