
యూరియా కోసం రైతుల ఆక్రందన
● రహదారిపై బైఠాయించిన అన్నదాతలు ● చర్చించిన ఎమ్మెల్యే కోరం కనకయ్య
ఇల్లెందు: యూరియా కోసం రైతుల కష్టాలు తీరడంలేదు. ఇల్లెందు మార్కెట్‌కు గురువారం ఉదయమే పెద్దసంఖ్యలో రైతులు చేరుకోగా, యూరియా లేదని సమాచారం ఇచ్చారు. దీంతో ఆగ్రహించిన వారు ఆస్పత్రి ప్రధాన రహదారి వరకు ర్యాలీగా వెళ్లి ఆందోళనకు చేపట్టారు. సమాచారం అందుకున్న సీఐ సురేష్ చేరుకుని సర్దిచెప్పినా ఆందోళన విరమించకపోవడంతో ఎమ్మెల్యే కోరం కనకయ్య చేరుకుని మాట్లాడారు. అయినా రైతులు ససేమిరా అనటంతో వాగ్వాదం చోటుచేసుకుంది. ఈక్రమాన మార్కెట్‌కు వెళ్లిన ఎమ్మెల్యే అక్కడ అధికారులతో చర్చించి బఫర్ స్టాక్‌గా ఉన్న 20 టన్నుల ఎరువును ఒక్కో బస్తా చొప్పున పంపిణీ చేయించడంతో వివాదం సద్దుమణిగింది. కాగా, రైతులతో సమన్వయం చేయలేకపోయిన సొసైటీ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏడీఏ లాల్‌చంద్, ఏఓ సతీష్, సీఈఓ హీరాలాల్, రాజు, మార్కెట్, సొసైటీల చైర్మన్లు బానోతు రాంబాబు, మెట్టల కృష్ణ, నాయకులు నబీ, కిరణ్, కృష్ణ, మోహన్‌రావు, రాజు, యాకుబ్‌షావలీ, బుర్ర వెంకన్న, మల్లెల వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.