
టీజీఎఫ్‌డీసీ ఉద్యోగులపై బదిలీ వేటు ?
ములకలపల్లి: తెలంగాణ రాష్ట్ర అటవీ అభివృద్ధి సంస్థ (టీజీఎఫ్‌డీసీ) ఆధ్వర్యంలో పెంచుతున్న జామాయిల్ తోటల్లో కలప మాయం ఘటనలో ఆ శాఖ అధికారులపై బదిలీ వేటు పడినట్లు విశ్వసనీయంగా తెలిసింది. మండలంలోని రంగాపురం శివారులో టీజీఎఫ్‌డీసీ ఆధ్వర్యంలో 2006 నుంచి యూకలిప్టస్ (జామాయిల్) తోటలు సాగు చేస్తున్నారు. గత నెలాఖరులో 2–ఏ, 2–బీ పరిధిలో 500పైగా చెట్లు మాయం కాగా, ఆలస్యంగా కళ్లు తెరచిన స్థానిక అధికారులు ములకలపల్లిలోని ఓ ప్రైవేట్ అడ్తీలో కొంత కలపను స్వాధీనం చేసుకున్నారు. చెట్లు నరికిన వ్యక్తిపై నామమాత్రపు జరిమానా విధించారు. ఈ ఉదంతంపై ఈనెల 8న ‘జామాయిల్ కలప మాయం’శీర్షికన ‘సాక్షి’లో కథనం ప్రచురితం కాగా స్పందించిన ఉన్నతాధికారులు విచారణ చేపట్టి.. మూడు రోజుల అనంతరం నివేదిక సమర్పించారు. దీంతో పాల్వంచ డీఎం కవితను హైదరాబాద్ కార్యాలయానికి అటాచ్ చేశారు. ములకలపల్లి రేంజ్ ప్లాంటేషన్ మేనేజర్ సునీతను రంగారెడ్డి డివిజన్‌కు బదిలీ చేసినట్లు తెలిసింది. వీరిస్థానంలో కొత్తగూడెం డీఎం చంద్రమోహన్‌ను పాల్వంచ ఇన్‌చార్జ్ డీఎంగా, సత్తుపల్లి పీఎం నాగరాజును ములకలపల్లి పీఎంగా కేటాయిస్తూ ఉత్తర్వులు జారీ అయినట్లు సమాచారం. ఐతే ఈ విషయాన్ని ఉన్నతాధికారులు ధ్రువీకరించాల్సి ఉంది.
చెట్ల చోరీపై కేసు నమోదు..
జామాయిల్ చెట్ల చోరీపై మంగళవారం కేసు నమోదు చేశామని ఎస్‌ఐ ఎస్.మధుప్రసాద్ వెల్లడించారు. ప్లాంటేషన్ మేనేజర్ సునీత పోలీస్ స్టేషన్లో లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేయగా.. చెట్లు నరికిన వ్యక్తి, అడ్తీకి సంబంధించిన వ్యక్తిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు.