
బురదే మిగిలింది..
వేల ఎకరాల్లో పంట నష్టం
వరదపాలైన రైతు కష్టార్జితం
పరిహారం అందించాలని వేడుకోలు
అధికారుల క్షేత్రస్థాయి పరిశీలన
ఆరెకరాల్లో పంట నష్టపోయా..
క్షేత్రస్థాయి పరిశీలన..
బూర్గంపాడు: నిన్నటి వరకు పచ్చగా కళకళలాడిన పంటచేలు.. నేడు బురదతో నిండి నిలువునా మాడిపోతున్నాయి. రెండు నెలలు శ్రమించి పెంచుకున్న పంటలను గోదావరి వరదలు ముంచెత్తడంతో రైతులు తీవ్ర ఆవేదనకు గురవుతున్నారు. గోదావరి పరీవాహక ప్రాంతంలో ఇటీవల వచ్చిన వరదలకు భద్రాచలం రెవెన్యూ డివిజన్‌లోని బూర్గంపాడు, అశ్వాపురం, మణుగూరు, పినపాక, దుమ్ముగూడెం, చర్ల మండలాల్లో వేలాది ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నాయి. ఈ ఏడాది ఆగస్టు రెండో వారం వరకు ఓ మోస్తారు వర్షాలతో పడగా.. గోదావరి ప్రవాహం తక్కువగా ఉండడంతో పరీవాహక ప్రాంతాల రైతులు ముందుగానే పంటలు సాగు చేశారు. అయితే ఇటీవల కురిసిన భారీ వర్షాలకు గోదావరికి వరదలు రావడంతో పంటలు నీటమునిగి రైతులు తీవ్రంగా నష్టపోయారు.
దెబ్బతిన్న మెట్టపంటలు..
గోదావరి పరీవాహక ప్రాంతాల్లో రైతులు సాగు చేసిన పత్తి, వరి, కూరగాయల పంటలు వరదలకు దెబ్బతిన్నాయి. సుమారు 2వేల ఎకరాలలో పత్తి, 4 వేల ఎకరాలలో వరి నీటమునిగాయి. అయితే వరి పంటకు పెద్దగా నష్టం జరగకపోవచ్చని, మెట్ట పంటలు మాత్రం పూర్తిగా దెబ్బతింటాయని రైతులు పేర్కొంటున్నారు. నీటమునిగిన పత్తి చేలల్లో వరద తగ్గిన తరువాత ఆకులపై బురద చేరి మొక్కల నిలువునా ఎండుతున్నాయి.
ఎకరాకు రూ.25వేల ఖర్చు..
ఇప్పటి వరకు విత్తనాలు, ఎరువులు, పురుగుమందులు, కూలీలకు ఎకరాకు రూ.25వేల వరకు ఖర్చు చేశామని, మరో రూ.15వేలు ఖర్చు చేస్తే పెట్టుబడులు పూర్తవుతాయని రైతులు అంటున్నారు. ఇప్పటికే పత్తిచేలు పూత, పిందెలతో పాటుగా కాయలతో ఏపుగా పెరుగుతున్నాయని, వరద పంటను పూర్తిగా తుడిచి పెట్టిందని వాపోతున్నారు. అదేవిధంగా ఇప్పుడిప్పుడే చేతికందుతున్న బెండ, దోస, బీర, సొర, గోరుచిక్కుడు వంటి కూరగాయల పంటలు వరదలో మునకేసి సుమారు 300 ఎకరాల్లో పూర్తిగా దెబ్బతిన్నాయని వాపోతున్నారు. జిల్లాలో సుమారు 3వేల ఎకరాలలో వరిపంట నీటమునగగా.. వరద 24 గంటల్లోనే తగ్గుముఖం పట్టడంతో పెద్దగా నష్టం ఉండదని చర్చసాగుతోంది. మరీ లోతట్టు ప్రాంతాల్లోని వరి పంట మాత్రం వరదకు నేలకొరిగి దెబ్బతింది. మిగతా ప్రాంతాల్లో నీట మునిగిన వరిపైరు వరద తగ్గిన తరువాత తేరుకుంటున్నట్లు రైతులు చెబుతున్నారు.
అధికారుల క్షేత్రస్థాయి పరిశీలన..
గోదావరి వరదలకు నీటమునిగిన పంటలను వ్యవసాయ శాఖ అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించి పంటనష్టం అంచనా వేయాల్సి ఉంది. శుక్రవారం మండల వ్యవసాయశాఖ అధికారులు నీటి ముంపు తొలగిన చేలను పరిశీలించారు. వరద పూర్తిస్థాయిలో తగ్గిన తరువాత క్షేత్రస్థాయి పరిశీలన చేసి పంటనష్టం అంచనా వేసి నివేదికలను సిద్ధం చేస్తామని అధికారులు పేర్కొంటున్నారు. గతేడాది మాదిరిగా పంట నష్టపోయిన రైతులకు ప్రభుత్వం పరిహారం అందించి ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు. పంట నష్టపోయిన రైతులకు రాయితీపై విత్తనాలు, ఎరువులు అందించాలని డిమాండ్ చేస్తున్నారు.
గోదావరి వరదకు
నీటమునిగిన పంటలు
గోదావరి వరదలకు నాలుగెకరా ల వరి మాగాణి, రెండెకరాల పత్తిచేను నీటమునిగింది. పత్తి చేను పూర్తిగా దెబ్బతింది. వరి మాగాణి ఒకట్రెండు రోజులు గడిస్తేగాని అక్కరకు వస్తుందో రాదో తెలుస్తుంది. వ్యవసాయశాఖ అధికారులు వరదలకు దెబ్బతిన్న పంటలను పరిశీలించి రిపోర్టులను ప్రభుత్వానికి పంపించాలి. ప్రభుత్వం పరిహారమందించి రైతులను ఆదుకోవాలి.
– పాపుకొల్లు సుధాకరరావు, రైతు, నాగినేనిప్రోలు
గోదావరి వరద ముంపునకు గురైన పంటలను మండల వ్యవసాయశాఖ అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలిస్తున్నారు. నివేదికలు సిద్ధం చేసి ఉన్నతాధికారులకు పంపిస్తాం. వరద ముంపు తగ్గాక పొలాల్లో నీటిని తీసివేసి ఆకులపై చేరిన ఒండ్రుమట్టిని స్ప్రేయర్లతో శుభ్రం చేసుకోవాలి. స్థానిక వ్యవసాయ అఽధికారుల సూచనలు పాటించాలి.
– బి.తాతారావు, ఏడీఏ, మణుగూరు

బురదే మిగిలింది..

బురదే మిగిలింది..

బురదే మిగిలింది..