
ఆర్థిక స్వావలంబన సాధించాలి
దుమ్ముగూడెం/అశ్వాపురం: మహిళలందరూ ఐకమత్యంతో స్వశక్తిగా కుటీర పరిశ్రమలు నెలకొల్పుకుని ఆర్థిక స్వావలంబన సాధించాలని ఐటీడీఏ సహాయ ప్రాజెక్టు అధికారి జనరల్ డేవిడ్ రాజ్ అన్నారు. శనివారం దుమ్ముగూడెం మండలం లక్ష్మీనగరంలోని గిరిజన చిక్కి యూనిట్‌ను, అశ్వాపురం మండలం తుమ్మలచెరువు గ్రామంలోని సమ్మక్క–సారక్క మహిళా కందిపప్పు ఉత్పత్తి కేంద్రాన్ని ఐటీసీ సంస్థ మేనేజర్ చెంగల్‌రావుతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా పల్లీపట్టి, కందిపప్పు తయారీ విధానాలను తెలుసుకుని సరసమైన ధరల కోసం అమ్మకాలు జరిగేలా ఆకర్షణీయమైన డిజైనింగ్, ప్యాకింగ్ చేయించేలా ఐటీసీ ఆధ్వర్యాన కృషి చేస్తామన్నారు. ఏడుగురు గిరిజన మహిళలు రూ.24 లక్షల సబ్సిడీతో రూ.40 లక్షలతో ఏర్పాటు చేసుకున్న గిరిజన చిక్కి యూనిట్‌ను రూపొందించుకోవడం అభినందనీయమన్నారు. ఈ కార్యక్రమాల్లో ఐటీసీ సంస్థ మేనేజర్ చెంగల్‌రావు, ప్యాకింగ్ డిజైనింగ్ కోఆర్డినేటర్ బేగ్, రామ్‌కుమార్, యూనిట్ మహిళలు పాల్గొన్నారు.