
గోదా‘వర్రీ’..!
నిలిచిన రాకపోకలు..
రహదారులపైకి చేరిన వరద
బూర్గంపాడు – భద్రాచలం మధ్య నిలిచిన రాకపోకలు
లోతట్టు ప్రాంతాల్లో ఇళ్లలోకి చేరిన నీరు
బూర్గంపాడు: గోదారి కన్నెర్రజేసింది. ఈ ఏడాది వరదలు ఉండవని భావించి పంటలు సాగు చేసిన రైతులను కన్నీటి పాలు జేసింది. మొన్నటి వరకు ఇసుక తిన్నెలతో కనిపించిన గోదావరి ఇటీవల కురిసిన వర్షాలకు ఒక్కసారిగా ఉప్పొంగింది. ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలతో నదిలోకి భారీగా వరద చేరుతోంది. గురువారం సాయంత్రానికి 52 అడుగులు దాటి మూడో ప్రమాద హెచ్చరికకు చేరువవుతున్న గోదావరి వరదకు భద్రాచలం రెవెన్యూ డివిజన్‌లో వందల ఎకరాల్లో పంటలు నీటమునిగాయి. రహదారులపైకి నీరు చేరడంతో రాకపోకలు నిలిచిపోయాయి. బూర్గంపాడులో కొన్ని ఇళ్లలోకి వరదనీరు చేరగా.. నిర్వాసితులను పునరావాస కేంద్రాలకు తరలించారు.
నష్టం మరింత పెరిగేనా..?
గోదావరి పరీవాహక ప్రాంత రైతులు వరదలతో వణికిపోతున్నారు. ఈ ఏడాది వరదలు ఉండవని భావించి పంటలు సాగు చేశారు. పత్తి, వరి, కూరగాయల పంటలు సాగు చేసి, పైపాట్లు చేసి ఎరువులు కూడా వేశారు. ఈ తరుణంలో వచ్చిన గోదావరి వరదలు బూర్గంపాడు, అశ్వాపురం, దుమ్ముగూడెం, చర్ల మండలాల్లో సుమారు 3వేల ఎకరాల్లో పంటలను నీటముంచాయి. భద్రాచలం వద్ద గోదావరి వరద మూడో ప్రమాద హెచ్చరికకు చేరువలో ఉన్న తరుణంలో పంట నష్టం మరింతగా పెరుగుతుందని ఆందోళన చెందుతున్నారు. పత్తి పంటకు ఇప్పటికే రైతులు రెండుసార్లు ఎరువులు వేసుకుని సస్యరక్షణ మందులు పిచికారీ చేశారు. ఈ తరుణంలో మొక్కలు నీటమునగటంతో రైతులు తల పట్టుకుంటున్నారు. ఇటీవల వేసిన వరి నాట్లు కూడా వరద ముంపునకు గురికావడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. వరదలతో పంటలతో పాటు రైతులు వాగుల వద్ద ఏర్పాటు చేసుకున్న విద్యుత్ మోటార్లు, డీజిల్ ఇంజన్లు సైతం నీటమునిగాయి.
పునరావాస కేంద్రాలకు తరలింపు..
గోదావరి వరదలతో బూర్గంపాడులోని మిల్లు సెంటర్, కొల్లుచెరువు ప్రాంతాల్లోని కొన్ని ఇళ్లలోకి వరద నీరు చేరింది. దీంతో బాధిత కుటుంబాలను అధికారులు పునరావాస కేంద్రాలకు తరలించారు. బూర్గంపాడులోని కేజీబీవీలో పునరావాస కేంద్రం ఏర్పాటు చేశారు. గోదావరి వరద ప్రభావిత ప్రాంతాలను అధికారులు పరిశీలిస్తూ ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు. పాల్వంచ డీఎస్పీ సతీష్‌కుమార్ ఆధ్వర్యంలో బూర్గంపాడు మండలంలో ఎస్‌ఐలు మేడ ప్రసాద్, నాగభిక్షం వరద ముంపు ప్రాంతాల్లో బందోబస్తు చేపట్టారు. బూర్గంపాడు తహసీల్దార్ కేఆర్‌కేవీ ప్రసాద్, ఎంపీడీఓ జమలారెడ్డి, ఎంపీఓ బాలయ్య ముంపు గ్రామాల్లో పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేసి బాధితులకు అవసరమైన చర్యలు చేపడుతున్నారు.
గోదావరి వరదలకు బూర్గంపాడు – భద్రాచలం మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. బూర్గంపాడు సమీపంలోని పులితేరు, సారపాక సమీపంలోని పెదవాగు బ్రిడ్జి, రెడ్డిపాలెంలోని చర్చి స్కూల్ వద్ద గోదావరి వరద ఆర్‌అండ్‌బీ రహదారిపైకి చేరడంతో ఈ మార్గంలో రాకపోకలకు అంతరాయం వాటిల్లింది. భద్రాచలం నుంచి దుమ్ముగూడెం, చర్ల వెళ్లే రోడ్లపైకీ వరదనీరు చేరడంతో అటు వైపు కూడా రాకపోకలు నిలిచిపోయాయి. భద్రాచలం నుంచి కూనవరం వెళ్లే రహదారిలో కూడా కొన్నిచోట్ల వరద నీరు రోడ్లపైకి చేరటంతో రాకపోకలను నిలిపివేశారు. గోదావరి వరద నీరు రోడ్లపైకి చేరడంతో అటుగా ఎవరూ ప్రయాణించకుండా పోలీస్, రెవెన్యూ శాఖలు చర్యలు చేపట్టాయి. ముంపు ప్రాంతాల్లో పోలీసు బందోబస్తు ఏర్పాటు చేసి వాహనాల రాకపోకలను నిలిపివేశారు.
వరద నీటిలో మునిగిన పంటచేలు

గోదా‘వర్రీ’..!