
గోడౌన్‌లో భారీగా మంటలు
దగ్ధమైన బ్లీచింగ్ పౌడర్, పండ్లు
రూ. 4 లక్షల ఆస్తి నష్టం
భద్రాచలంఅర్బన్ : భద్రాచలంలోని పాత మార్కెట్ గోడౌన్ (నెహ్రూ మార్కెట్)లో గురువారం తెల్ల వారుజామున 5 గంటల సమయంలో మంటలు చెలరేగాయి. దీంతో బ్లీచింగ్ పౌడర్ బస్తాలతో పాటు పలువురు వ్యాపారులకు చెందిన పండ్లు పూర్తిగా కాలి బూడిదయ్యాయి. స్థానికులు అగ్నిమాపక శాఖకు సమాచారం అందించగా, అక్కడికి చేరుకున్న సిబ్బంది మంటలను అదుపు చేసేందుకు దాదాపు గంటన్నర సమయం పట్టింది. మంటలు చెలరేగిన సమయంలో అందులో ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పిందని స్థానికులు అంటున్నారు. నిబంధనలకు విరుద్ధంగా జనావాసాల మధ్య స్టాక్ గోడౌన్ ఏర్పాటు చేసిన వారిపై అధికారులు చర్యలు తీసుకోవాలని కోరారు. కాగా అగ్ని ప్రమాదంలో రూ.4 లక్షల విలువైన బ్లీచింగ్ పౌడర్, పండ్లు అగ్నికి ఆహుతయ్యాయని అగ్నిమాపక శాఖ అధికారులు తెలిపారు. గోడౌన్‌లో స్టాక్ ఉంచిన బ్లీచింగ్ పౌడర్ కారణంగానే కెమికల్ రియాక్షన్ జరిగి భారీగా మంటలు ఎగిసిపడ్డాయని వారు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. భద్రాచలం అగ్నిమాపక శాఖ అధికారి శ్రీనివాస్, లీడింగ్ ఫైర్ ఫైటర్ సాధిక్, ఫైర్ ఫైటర్లు కుమారస్వామి, రాజబాబు, కిరణ్, ప్రకాష్ పాల్గొన్నారు.
బాధితులను ఆదుకోవాలి..
అగ్ని ప్రమాదంలో నష్టపోయిన పండ్ల వ్యాపారులను ఆదుకోవాలని సీఐటీయూ నాయకులు ప్రభుత్వాన్ని కోరారు. రెండు షాపుల్లో ఉన్న ఐదు నాలుగు చక్రాల బండ్లు పూర్తిగా కాలిపోయాయని, సుమారు రూ.లక్ష విలువైన పండ్లు కాలిపోయాయని తెలిపారు. ఈ ఘటనపై పూర్తి స్థాయిలో దర్యాప్తు చేసి నష్టపోయిన వారికి పరిహారం ఇప్పించాలని అన్నారు. కార్యక్రమంలో సీఐటీయూ నాయకులు ఎం.బి. నర్సారెడ్డి, బండారు శరత్‌బాబు, సీపీఎం పట్టణ కార్యదర్శి గడ్డం స్వామి, పండ్ల వర్తక సంఘం నాయకులు వి.రాము బాలాజీ, వాసు, శ్రీను, రాము, జానీ, బాలకృష్ణ తదితరులు పాల్గొన్నారు.

గోడౌన్‌లో భారీగా మంటలు