
గంజాయి, మారణాయుధాల పట్టివేత
ముగ్గురిని అరెస్ట్ చేసిన పోలీసులు.. మరొకరు పరార్
నిందితులు తమిళనాడు, కేరళ రాష్ట్రాల వారుగా గుర్తింపు
పాల్వంచ: అక్రమంగా తరలిస్తున్న గంజాయిని ఎకై ్సజ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు పట్టుకోగా, నిందితుల నుంచి మారణాయుధాలను స్వాధీనం చేసుకున్న ఘటన పాల్వంచలో చోటుచేసుకుంది. ఈ మేరకు ఎకై ్సజ్ శాఖ డిప్యూటీ కమిషనర్ జి.జనార్దన్‌రెడ్డి గురువారం మీడియాకు వివరాలు వెల్లడించారు. విశ్వసనీయ సమాచారం మేరకు బుధవారం రాత్రి పాల్వంచలో వాహనాల తనిఖీ చేపట్టామని, అనుమానాస్పదంగా కనిపించిన ఐచర్ వ్యాన్, వోక్స్ వ్యాగన్ పోలో కారును తనిఖీ చేయగా ఆయా వాహనాల్లో రూ.53లక్షల విలువ చేసే 105 కేజీల గంజాయితో పాటు ఒక పిస్టల్, ఐదు రివాల్వర్లు, 40 బుల్లెట్లు, 12 ఖాళీ మ్యాగజైన్లు లభ్యమయ్యాయని చెప్పారు. వ్యాన్, కారుతో పాటు ముగ్గురిని అదుపులోకి తీసుకోగా, మరొకరు తప్పించుకుని పరారయ్యాడని తెలిపారు. నిందితుల్లో కేరళ రాష్ట్రంలోని ఎర్నాకుళం జిల్లా అలువాకు చెందిన బీలాల్ వి.ఎస్, తమిళనాడు రాష్ట్రం తిరుచ్చి జిల్లా తిరియర్‌కు చెందిన శ్యాం సుందర్, విశ్వాంబల్ సముద్రమ్ గ్రామానికి చెందిన కాశీ నందన్ సంతోష్ ఉన్నారని గుర్తించామని, అంతేగాక తిరుచ్చికి చెందిన జేమ్స్ అనే వ్యక్తి పరారీలో ఉన్నాడని వివరించారు. ఒడిశా నుంచి భద్రాచలం, ఖమ్మం, చైన్నె మీదుగా తిరుచ్చికి గంజాయి తరలిస్తున్నట్లు గుర్తించామని, తదుపరి విచారణ నిమిత్తం వారిని పాల్వంచ పోలీస్‌స్టేషన్‌లో అప్పగించామని చెప్పారు. అక్కడ విచారణ అనంతరం జ్యుడీషియల్ రిమాండ్ నిమిత్తం కోర్టుకు తరలించామని తెలిపారు. నిందితులను చాకచక్యంగా పట్టుకున్న ఎన్స్‌ఫోర్స్‌మెంట్ అసిస్టెంట్ కమిషనర్ జి.గణేష్, ఇన్‌స్పెక్టర్ ఎస్.రమేష్, సబ్ ఇన్‌స్పెక్టర్ సీహెచ్.శ్రీహరి రావు, సిబ్బంది ఖరీం, బాలు, సుధీర్, వెంకటేశ్వర్లు, హనుమంతరావు, విజయ్, హరీష్, వీరబాబు, ఉపేందర్‌ను జనార్దన్‌రెడ్డి అభినందించారు. కాగా, ఈ నలుగురిపై భారత ఆయుధ చట్టం కింద కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ సురేష్ తెలిపారు.
నిందితులది మొదటి నుంచీ నేరచరితే..
గంజాయి, మారణాయుధాలతో పట్టుబడిన నిందితులు కేరళలో గ్యాంగ్‌స్టర్ టీంగా చెలామణి అవుతున్నారని, కొచ్చిలో గ్యాంగ్‌స్టర్ బిలాల్‌పై 100కు పైగా కేసులు ఉండగా 28 సార్లు శిక్ష అనుభవించాడని తెలిసింది. ఎనిమిదేళ్ల శిక్ష అనంతరం ఇటీవలే విడుదలై మళ్లీ నేరాలకు పాల్పడేందుకు మధ్యప్రదేశ్‌లో మారణాయుధాలు కొనుగోలు చేశాడు. రెండో నిందితుడైన తమిళనాడుకు చెందిన శ్యాంసుందర్‌కు గంజాయి వ్యాపారంలో ఆరితేరిన వ్యక్తిగా పేరుంది. ప్రస్తుతం అతడు డ్రైవర్‌గా వచ్చాడు. తమిళనాడుకు చెందిన జేమ్స్‌కు కూడా భారీ నేర చరిత్ర ఉన్నట్లు సమాచారం.
పిస్టల్, 5 రివాల్వర్లు, 40 బుల్లెట్లు, 12 ఖాళీ మ్యాగజైన్లు స్వాధీనం

గంజాయి, మారణాయుధాల పట్టివేత