
ఆశలు.. అడియాసలేనా?
● అర్ధంతరంగా అగిన సీఎం పర్యటన ● వాయిదా పడిందా.. రద్దయిందా తెలియని అయోమయం
చండ్రుగొండ : సీఎం సారొస్తారని.. తమ సమస్యలు పరిష్కారం అవుతాయని అనుకున్న గిరిజనుల ఆశలు అడియాసలుగానే మిగిలాయి. తమ ఊరికి రేవంత్‌రెడ్డి వస్తున్నారని, గ్రామానికి వరాలు కురిపిస్తారని బెండాలపాడులోని అన్ని వర్గాల ప్రజలు ఆశించారు. అంతేకాక జిల్లా అధికారులు సైతం ఇక్కడే అక్కడే మోహరించి సీఎం పర్యటన ఏర్పాట్లల్లో నిమగ్నమయ్యారు. దీంతో ఆ కుగ్రామంలో పండుగ వాతావరణం నెలకొంది. మరోవైపు సీఎం రాక కోసం చండ్రుగొండలో హెలీప్యాడ్ కూడా సిద్ధం చేశారు. దామరచర్లలో సుమారు 25 ఎకరాల్లో సభాస్ధలి పనులు సగం వరకు పూర్తయ్యాయి. హైదరాబాద్ నుంచి పెద్ద ఎత్తున వాటర్ ప్రూఫ్ టెంట్లు వచ్చాయి. అయితే సీఎం పర్యటన అర్ధంతరంగా ఆగిపోగా.. అందుకు కారణమేంటనేది జవాబు దొరకని ప్రశ్నగా మిగిలిపోయింది. ఉపరాష్ట్రపతి ఎన్నిక నామినేషన్ కార్యక్రమంలో పాల్గొనేందుకు సీఎం రేవంత్‌రెడ్డి ఢిల్లీ వెళ్తున్నారని, అందుకే ఇక్కడి పర్యటన వాయిదా పడిందని ఆ పార్టీ శ్రేణులు చెప్పినా.. సీఎం ఢిల్లీ కూడా వెళ్లకపోవడంతో ప్రజల్లో పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
వెనక్కు తీసుకెళ్తున్న సభ సామగ్రి..
బెండాలపాడు గ్రామంలో బీటీ రోడ్డు పనులు చేపట్టగా అవి మధ్యలోనే నిలిచిపోయాయి. హెలీప్యాడ్ వద్ద వినియోగించేందుకు తీసుకొచ్చిన కంకరను రాత్రికి రాత్రే తీసుకెళ్తున్నారు. దామరచర్లలోని సభాస్థలి వద్దకు తీసుకువచ్చిన టెంట్ సామగ్రి సైతం తీసుకెళ్లిపోయారు. ఇదిలా ఉంటే ఎమ్మెల్యే జారె వర్గీయులు ఈనెల 30వ తేదీ లోపు సీఎం పర్యటన ఉంటుందని చెప్తున్నా.. ఆదినారాయణ మాత్రం ఎలాంటి ప్రకటన చేయలేదు.