
పర్యావరణ అనుమతిపై ప్రజాభిప్రాయ సేకరణ
మణుగూరుటౌన్: మణుగూరు ఓసీ విస్తరణలో భాగంగా పర్యావరణ అనుమతులపై బుధవారం రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి ఆధ్వర్యంలో ప్రజాభిప్రాయ సేకరణ నిర్వహించారు. ప్రస్తుత మణుగూరు ఓసీలో బొగ్గు నిల్వలు మరో ఆరు నెలల్లో అడుగంటనుండగా, రాష్ట్ర విద్యుత్ అవసరాల నేపథ్యంలో ఓసీ విస్తరణ అనివార్యమైంది. దీంతో మండలంలోని తిర్లాపురం, రామానుజవరం, మున్సిపాలిటీలోని కొమ్ముగూడెంలో రైతుల నుంచి 813 ఎకరాలు సేకరించనుంది. పర్యావరణ అనుమతులకు సింగరేణి దరఖాస్తు చేయగా, అదనపు కలెక్టర్ వేణుగోపాల్, కాలుష్య నియంత్రణ మండలి ఈఈ బి.రవీందర్ ప్రజాభిప్రాయ సేకరణ నిర్వహించారు. ఈ సందర్భంగా ఏరియా జీఎం దుర్గం రాంచందర్ మాట్లాడుతూ.. మణుగూరు ఓసీ విస్తరణతో కలిగే ప్రయోజనాలు, మణుగూరు అభివృద్ధికి సింగరేణి చేపట్టిన చర్యలను వివరించారు. ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు మాట్లాడుతూ.. నిర్వాసితులకు మెరుగైన ప్యాకేజీ, ప్రాజెక్ట్ ప్రభావిత గ్రామాల్లో ఆర్‌ఓఆర్ ప్లాంట్, మౌలిక సదుపాయాల కల్పనకు కృషి చేయాల్సిన బాధ్యత సింగరేణిపై ఉందన్నారు. కార్యక్రమానికి హాజరైన రామానుజవరం, తిర్లాపురం, కొమ్ముగూడెం నిర్వాసితులు, రాజుపేట గ్రామస్తులు మాట్లాడుతూ.. సింగరేణి పరిసర గ్రామాల్లో సేవా కార్యక్రమాలు చేపట్టాలని, గ్రామాల అభివృద్ధికి తోడ్పాటునందించాలని, నిత్యం దుమ్ము, ధూళితో ఇబ్బందులు పడుతున్న రాజుపేటను తరలించాలని వేడుకున్నారు. కంపెనీలో స్థానికులకే ఉద్యోగాలు ఇవ్వాలని, పరిసర గ్రామాల్లో భారీ ఎత్తున మొక్కలు పెంచి పర్యావరణ పరిరక్షణకు కృషి చేయాలని కోరారు. సమావేశంలో వెల్లడించిన అభిప్రాయాలను వీడియో చిత్రీకరించి భద్రపరుస్తున్నట్లు అధికారులు చెప్పారు. కార్యక్రమంలో స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ సుమ, తహసీల్దార్ అద్దంకి నరేశ్, ఎంపీడీఓ శ్రీనివాసరావు, కమిషనర్ ప్రసాద్, ఐఎన్‌టీయూసీ రాష్ట్ర నాయకులు త్యాగరాజన్, కృష్ణంరాజు, ఏఐటీయూసీ బ్రాంచ్ సెక్రటరీ రాంగోపాల్, సీపీఐ నాయకులు సుధాకర్ తదితరులు పాల్గొన్నారు.