భద్రాచలం: భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి వారి నిత్యకల్యాణ వేడుక మంగళవారం నేత్రపర్వంగా సాగింది. తెల్లవారుజామున గర్భగుడిలో స్వామివారికి సుప్రభాత సేవ, సేవా కాలం, ఆరాధన తదితర పూజలు చేశారు. అనంతరం బేడా మండపంలో కొలువుదీర్చి విశ్వక్సేన పూజ, పుణ్యావాచనం చేశారు. స్వామివారికి కంకణధారణ, యజ్ఞోపవీత ధారణ, అమ్మవారికి కంకణధారణ, యోక్త్రధారణ గావించి నిత్యకల్యాణ ఘట్టాన్ని ఆలయ అర్చకులు శాస్త్రోక్తంగా నిర్వహించారు. కాగా, మంగళవారాన్ని పురస్కరించుకుని అభయాంజనేయస్వామి వారికి అభిషేకం, ప్రత్యేక పూజలు చేశారు.
తాలిపేరుకు కొనసాగుతున్న వరద
10 గేట్లు ఎత్తి 20,759 క్యూసెక్కుల నీరు విడుదల
చర్ల: ఎగువ ప్రాంతమైన ఛత్తీస్‌గఢ్‌లో భారీ వర్షాలు కురుస్తుండగా మండలంలోని తాలిపేరు మధ్యతరహా ప్రాజెక్టుకు వరద ఉధృతి కొనసాగుతోంది. మంగళవారం 21,387 క్యూసెక్కుల చొప్పున వరదనీరు రాగా, 10 గేట్లు ఎత్తి 20,759 క్యూసెక్కుల చొప్పున నీటిని దిగువన ఉన్న గోదావరి నదిలోకి విడుదల చేశారు. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటిమట్టం 74 మీటర్లు కాగా.. ఎగువ నుంచి వస్తున్న వరదను దృష్టిలో పెట్టుకుని నీటిమట్టాన్ని 71.84 మీటర్లుగా క్రమబద్ధీకరిస్తున్నారు.
ఆధునిక విద్య అందించడమే లక్ష్యం
పాల్వంచ: ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు ఆధునిక విద్య అందించడమే సర్కారు లక్ష్యమని జిల్లా విద్యాశాఖ అకడమిక్ మానిటరింగ్ అధికారి ఎ.నాగ రాజశేఖర్ అన్నారు. స్థానిక కేజీబీవీలో జిల్లాలోని గణిత, భౌతిక శాస్త్ర ఉపాధ్యాయులకు మంగళవారం శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం ఖాన్ అకాడమీ ద్వారా గణిత, సామాన్య శాస్త్రంలో 6 నుంచి 9వ తరగతి వరకు విద్యార్థులకు ఆధునిక సాంకేతిక విద్యను అందిస్తోందని తెలిపారు.
పిల్లలు ఇంటి వద్ద అభ్యసన మెరుగుపర్చుకోవడంతో పాటు విషయ పరిజ్ఞానాన్ని అభివృద్ధి చేసుకునేందుకు ఇది దోహదం చేస్తుందని చెప్పారు. ఈ శిక్షణలో నేర్చుకున్న అంశాల ద్వారా పిల్లలు ఖాన్ అకాడమీ తరగతుల్లో రిజిస్టర్ చేసుకోవడం, తరగతులను ఎలా ఉపయోగించుకోవాలనే అంశాలపై అవగాహన కల్పించాలని ఉపాధ్యాయులను ఆదేశించారు. కార్యక్రమంలో రిసోర్స్ పర్సన్లు నాగుల్‌మీరా, హరిప్రసాద్, సంపత్‌కుమార్, శంకర్ రావు తదితరులు పాల్గొన్నారు.
‘నవోదయ’లో ముగిసిన కళా ఉత్సవ్
కూసుమంచి: పాలేరులోని జవహర్ నవోదయ విద్యాలయలో రెండు రోజుల పాటు నిర్వహించిన క్లస్టర్ స్థాయి కళా ఉత్సవ్ పోటీలు మంగళవారంతో ముగిశాయి. ఈ పోటీల్లో ప్రతిభ చాటిన విద్యార్థులకు డీఈఓ కార్యాలయ అసిస్టెంట్ కమిషనర్ లక్ష్మీప్రసాద్ ప్రశంసాపత్రాలు అందజేసి మాట్లాడారు. విద్యార్థుల్లో కళానైపుణ్యాన్ని వెలికితీసేలా పోటీలు నిర్వహించడం అభినందనీయమని తెలిపారు. ఎంఈఓ బీ.వీ. రామాచారి మాట్లాడగా విద్యాలయ ప్రిన్సిపా ల్ కె.శ్రీనివాసులు, వివిధ జిల్లాల నవోదయ విద్యాలయాల ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

నేత్రపర్వంగా రామయ్య నిత్యకల్యాణం