
వానలతో వి‘పత్తే’నా..
● పత్తి చేలలో నిలుస్తున్న నీరు ● ఎర్రబారుతున్న మొక్కలు ● రాలిపోతున్న పూత, పిందె
బూర్గంపాడు: ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో పత్తి చేలు ఎర్రబారుతున్నాయి. లోతట్టు ప్రాంతాల్లోని చేలలో నీరు నిలిచి మొక్కలు క్రమేపీ దెబ్బతింటున్నాయి. ఈ ఏడాది ఇప్పటి వరకు ఆశాజనంగా ఉన్న పత్తి చేలు.. పది రోజులుగా కురుస్తున్న వానలను తట్టుకోలేకపోతున్నాయి. వర్షాలకు పూత, పిందె రాలుతున్నాయి. పంటను బూజు తెగుళ్లు, చీడపీడలు ఆశిస్తున్నాయి. మరో వారం రోజుల పాటు వర్షాలు కురుస్తాయనే వాతావరణ శాఖ హెచ్చరికలతో పత్తి రైతుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది.
గణనీయంగా పెరిగిన సాగు..
జిల్లాలో ఈ ఏడాది పత్తి సాగు గణనీయంగా పెరిగింది. వరుసగా రెండేళ్ల పాటు మిర్చి వేసిన రైతులకు నష్టాలే మిగలడంతో ఆ పంట సాగును తగ్గించి పత్తి వైపు దృష్టి సారించారు. దీంతో జిల్లాలో సుమారు 2.30 లక్షల ఎకరాల్లో ఈ ఏడాది పత్తి పంట సాగవుతోంది. పలు మండలాల్లో జూన్ ఆరంభంలోనే రైతులు పత్తి గింజలు వేయగా.. పంట సాగు చేసి 70 రోజులు కావొస్తోంది. ఇటీవలి వరకు పత్తి పంటలకు వాతావరణం అనుకూలంగా ఉంది. అడపాదడపా వర్షాలతో మొక్కలు ఏపుగా పెరగడంతో పాటు పైపాట్లు చేయడం, ఎరువులు వేసేందుకు వాతావరణం అనుకూలంగా మారింది. ప్రస్తుతం చాలా చోట్ల పూత, పిందె దశకు చేరింది. ఈ తరుణంలో పది రోజులుగా కురుస్తున్న వర్షాలు పత్తి పంటపై ప్రభావం చూపుతున్నాయి. మొన్నటి వరకు ఏపుగా, ఆరోగ్యంగా ఎదిగిన మొక్కలకు ఇటీవల కురుస్తున్న వర్షాలు ప్రతికూలంగా మారాయి. లోతట్టు ప్రాంత భూముల్లో నీరు చేరి పత్తి మొక్కలు ఎర్రబారుతున్నాయి. పూత, పిందెలు వానలకు నేలరాలుతుండగా.. పంటకు బూజు తెగుళ్లు, చీడపీడలు ఆశిస్తున్నాయి.
పెరుగుతున్న కలుపు..
వరుసగా కురుస్తున్న వర్షాలతో పత్తిలో పైపాట్లు చేసేందుకు వీల్లేకుండా పోయింది. దీంతో కలుపు పెరుగుతుండగా.. నివారణకు మందుల పిచికారీ చేద్దామన్నా వర్షపు జల్లులు ఆగడం లేదు. ప్రస్తుతం కురుస్తున్న చిన్నపాటి జల్లులు పత్తి పంటకు నష్టం కలిగిస్తున్నాయి. నిత్యం వర్షం వస్తుండడంతో మొక్కలు ఎర్రబారి ఆకులు, పూత, పిందె రాలుతున్నాయి. భూమిలో తేమ తగ్గకపోవడంతో మొక్కలు ఆరోగ్యకరంగా ఎదగడం లేదు.
‘నానో’తో మేలంటున్న అధికారులు..
వర్షాలకు పత్తి చేలలో నీరు నిల్వకుండా రైతులు తగు చర్యలు తీసుకోవాలని వ్యవసాయ అధికారులు సూచిస్తున్నారు. కాల్వలు తీసి నీటిని బయటకు పంపించాలని చెబుతున్నారు. వర్షాలతో పత్తి ఎర్రబారకుండా నానో యూరియాను పిచికారీ చేయాలని అంటున్నారు. ప్రస్తుతం మొక్కల వేరు వ్యవస్థ సరిగా పనిచేయదని, అందుకే నానో యూరియాను వినియోగించాలని సూచిస్తున్నారు.