
సీఎం పర్యటన వాయిదా
చండ్రుగొండ : ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి జిల్లా పర్యటన వాయిదా పడింది. చండ్రుగొండ మండలం బెండాలపాడులో ఈ నెల 21న ఇందిరమ్మ ఇళ్ల ప్రారంభోత్సవాలు, గృహప్రవేశాల కార్యక్రమాల్లో సీఎం పాల్గొనాల్సి ఉంది. ఈ మేరకు ఏర్పాట్లు కూడా పూర్తి కావొచ్చాయి. అయితే అదే రోజున ఉపరాష్ట్రపతి ఎన్నికలకు నామినేషన్ల కార్యక్రమం ఉండడంతో రేవంత్‌రెడ్డి ఢిల్లీ పర్యటన ఖరారైంది. దీంతో సీఎం జిల్లా పర్యటన వాయిదా పడినట్లు నీటి పారుదల అభివృద్ధి సంస్ధ చైర్మన్ మువ్వా విజయ్‌బాబు మంగళవారం విలేకరులకు తెలిపారు. ముఖ్యమంత్రి పర్యటన మళ్లీ ఎప్పుడు ఉంటుందనేది త్వరలోనే ప్రకటిస్తామని చెప్పారు. కాగా, సీఎం పర్యటన వాయిదా పడినట్టు సాయంత్రం తెలియగా.. ఉదయం కలెక్టర్ జితేష్ వి పాటిల్, ఎస్పీ రోహిత్‌రాజు, ఎమ్మెల్యే జారే ఆదినారాయణ తదితరులు వర్షంలో తడుస్తూనే ఏర్పాట్లను పర్యవేక్షించారు. చండ్రుగొండలోని హెలీప్యాడ్, దామరచర్లలో బహిరంగసభా స్థలి వద్ద పనులను తనిఖీ చేసి సలహాలు, సూచనలు అందించారు. ఆయా కార్యక్రమాల్లో పీసీసీ కార్యదర్శి నాగ సీతారాములు, నాయకులు కోనేరు సత్యనారాయణతో పాటు పలువురు అధికారులు పాల్గొన్నారు.