
భవిష్యత్ ‘పచ్చ’గా ఉండేలా..
విద్యార్థుల్లో అవగాహనే లక్ష్యంగా
జాతీయస్థాయి పోటీలు
సుస్థిర భవిష్యత్‌కు పునాది
వేసేలా కార్యాచరణ
కేంద్ర పర్యావరణ, అటవీ, వాతావరణ మార్పుల మంత్రిత్వశాఖ
ఆధ్వర్యాన నిర్వహణ
పర్యావరణం విలువ తెలుసుకున్నాం..
పర్యావరణ రక్షణలో భాగస్వామి కావాలి..
కరకగూడెం: నేటి ప్రపంచంలో పర్యావరణ పరిరక్షణ అనేది అత్యంత కీలకమైన అంశం. భవిష్యత్ తరాలకు సురక్షితమైన, ఆరోగ్యకరమైన భూమి, గాలి, నీరును అందించాల్సిన బాధ్యత మనందరిపై ఉంది. ఈ బాధ్యతను విద్యార్థుల్లో, యువతలో పెంపొందించడానికి వారిని పర్యావరణ పరిరక్షణలో క్రియాశీలకంగా భాగస్వామ్యం చేయడానికి కేంద్ర పర్యావరణ, అటవీ, వాతావరణ మార్పుల మంత్రిత్వశాఖ ఆధ్వర్యంలో ఏటా నేషనల్ స్టూడెంట్స్ పర్యావరణ్ కాంపిటీషన్ (ఎన్‌ఎస్‌పీసీ) నిర్వహిస్తోంది. ‘హరిత్ – ద వే ఆఫ్ లైఫ్’ అనే థీమ్‌తో దేశవ్యాప్తంగా 1 నుంచి 10వ తరగతి విద్యార్థులకు గత నెల 1వ తేదీ నుంచి పోటీలు నిర్వహిస్తున్నారు. ఇవి ఈ నెల 21 వరకు కొనసాగనున్నాయి. జిల్లాలోని అన్ని ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులు మొక్కలు నాటుతూ సెల్ఫీలు దిగుతూ యాప్‌లో అప్‌లోడ్ చేస్తున్నారు. అలాగే, ఈ–సర్టిఫికెట్లు అందుకుంటున్నారు. జాతీయస్థాయిలో క్విజ్ పోటీల్లో ప్రతిభ చూపిన వారికీ నగదు పారితోషికంతో పాటు ‘జాతీయ హరిత విద్యార్థి’ అవార్డుకు అర్హత పొందవచ్చు. ఆగస్టు 30న ఫలితాలు వెల్లడిస్తారు. నేషనల్ స్టూడెంట్ పర్యావరన్ కాంపిటీషన్ దేశవ్యాప్తంగా పాఠశాలలు, కళాశాలల విద్యార్థుల్లో పర్యావరణంపై అవగాహన, బాధ్యతను పెంపొందించడానికి నిర్వహించే జాతీయస్థాయి పోటీ. పర్యావరణ సమస్యలపై అవగాహన, వాటి పరిష్కారాల దిశగా ఆలోచన, ఆచరణాత్మక చర్యలు చేపట్టడానికి వారిని ప్రోత్సహించడమే ప్రధాన లక్ష్యం. పాఠశాల విద్యార్థులే కాకుండా ఇంటర్, డిగ్రీ విద్యార్థులతో పాటు ఆసక్తి ఉన్న ప్రతీ ఒక్కరూ ఈ పోటీల్లో పాల్గొనవచ్చు.
ఎన్‌ఎస్‌పీసీ లక్ష్యాలు..
●విద్యార్థులు, యువతలో వాతావరణ మార్పు లు, కాలుష్యం, జీవవైవిధ్య నష్టం, వనరుల క్షీణత వంటి అంశాలపై అవగాహన కల్పించడం.
●పర్యావరణంపై వ్యక్తిగత బాధ్యతను గుర్తించి, సుస్థిర జీవనశైలిని అలవర్చుకునేలా ప్రోత్సాహం.
●పర్యావరణ సమస్యలకు వినూత్న, ఆచరణాత్మక పరిష్కారాలను కనుగొనడానికి విద్యార్థులను ప్రేరేపించడం.
●పర్యావరణ పరిరక్షణకు వ్యక్తిగత, సామాజిక స్థాయిలో చేపట్టాల్సిన చర్యలపై అవగాహన కల్పించి, ఆచరణలో పెట్టేలా ప్రోత్సహించడం.
●పర్యావరణ రంగంలో నిపుణులు, విద్యార్థులు, ఉపాధ్యాయుల మధ్య విజ్ఞానం, అనుభవాలను పంచుకోవడానికి ఒక వేదికను అందించడం.
పోటీ విధానం, ప్రయోజనాలు..
సాధారణంగా క్విజ్, వ్యాసరచన, ప్రాజెక్ట్ ప్రదర్శ న లు, డిబేట్లు, కళలు, క్రాఫ్ట్ లాంటి విభాగాల్లో పోటీలు ఉంటాయి. ఇందులో పాల్గొనడం వల్ల విద్యార్థులకు పర్యావరణంపై సమగ్ర అవగాహన పెరుగుతుంది. సృజనాత్మకత, ఆవిష్కరణలకు ప్రోత్సాహం లభిస్తుంది. భవిష్యత్‌లో పర్యావరణ రంగంలో వృత్తిని ఎంచుకోవడానికి ప్రేరణ లభిస్తుంది.
పర్యావరణ పరిరక్షణకు
ముందడుగు
నేషనల్ స్టూడెంట్స్ పర్యావరణ్ కాంపిటీషన్‌లో పాల్గొనడం నాకు ఒక మంచి అనుభవం. టీచర్లు మమ్మల్ని మొక్కలు నాటమని ప్రోత్సహించారు. మొక్కలు నాటి, వాటికి నీళ్లు పోస్తూ పర్యావరణం విలువ తెలుసుకున్నాం. పర్యావరణ పరిరక్షణకు నేను కూడా పాటుపడుతా. –ఎర్ర స్వీటీ, 10వ తరగతి, కరకగూడెం
విద్యార్థుల్లో పర్యావరణ అవగాహన పెంపు కోసం ఈ పోటీలు ఉపయోగపడతాయి. పుస్తకాల్లో చదివే పర్యావరణ పరిరక్షణ, వాతావరణ మార్పులు, కాలుష్యం వంటి సమస్యల పరిష్కారం కోసం యువత ఆచరణలోకి రావాలి. చిన్నప్పటి నుంచే బాధ్యత కలిగిన పౌరులుగా మారుతారు. –నాగరాజశేఖర్, జిల్లా అకడమిక్ మానిటరింగ్ ఆఫీసర్

భవిష్యత్ ‘పచ్చ’గా ఉండేలా..

భవిష్యత్ ‘పచ్చ’గా ఉండేలా..

భవిష్యత్ ‘పచ్చ’గా ఉండేలా..