
మణుగూరుపై సింగరేణి ముద్ర
అభివృద్ధికి సహకారం
● పట్టణాభివృద్ధికి సహకారం ఎంతో.. ● సీఎస్‌ఆర్‌లో భాగంగా రూ.కోట్ల నిధుల కేటాయింపు ● ప్రత్యక్షంగా, పరోక్షంగా వేలాది మందికి ఉపాధి
మణుగూరుటౌన్: మణుగూరు అభివృద్ధిలో సింగరేణి ముద్ర కనిపిస్తుంది. ప్రత్యక్షంగా, పరోక్షంగా తనవంతు సహకారం అందిస్తూ కీలకపాత్ర పోషి స్తోంది. బొగ్గు ఉత్పత్తిలో తన రికార్డులను తానే తిరగరాస్తూ మణుగూరు కీర్తిని నలుదిశలా వ్యాప్తి చేస్తోంది. సింగరేణి 1974 పీకే–1 గనిగా ప్రారంభమై అంచెలంచెలుగా విస్తరిస్తూ ఇప్పటికే 50 ఏళ్లు పూర్తి చేసుకుని 51వ వసంతంలోకి అడుగులు పెడుతోంది. ఇటు స్థానికులకు ఉపాధికల్పించి చేయూతనందిస్తూనే మరోవైపు వేలాది మందికి ప్రత్యక్ష, పరోక్ష ఉపాధికి ఊతమిస్తుండగా.. నేడు ఓసీ విస్తరణ ప్రజాభిప్రాయ సేకరణ సమావేశం జరగనున్న నేపథ్యంలో ప్రత్యేక కథనం.
రూ.కోట్లు కేటాయింపు..
సింగరేణి తన బొగ్గు ఉత్పత్తి లక్ష్యాలను ఏటా పెంచుకుంటూనే సమీప గ్రామాల అభివృద్ధి, మణుగూరుకు 2014 నుంచి 2025 వరకు రూ.20కోట్లకు పైగా షేప్ నిధులు మంజూరు చేసింది. పంచాయతీల అభివృద్ధికి, మున్సిపాలిటీలో అభివృద్ధి పనులతో పాటు సింగరేణి ప్రభావిత గ్రామాల్లో బోర్‌వెల్స్ తీయించడం, సైడ్‌డ్రెయిన్లు, సీసీ రోడ్లు, బీటీ రోడ్లు, కమ్యూనిటీ హాళ్ల ఏర్పాటుకు ఈ నిధులు వెచ్చిస్తున్నారు. ప్రభుత్వ పాఠశాలల బలోపేతానికి ఫర్నిచర్, మౌలిక సదుపాయాల కల్పనతో పాటు ప్రభుత్వ పాఠశాలల్లోని తరగతి గదుల నిర్మాణానికి నిధులు కేటాయించింది. మణుగూరు మున్సిపాలిటీ ముంపునకు గురి కాకుండా కట్టువాగు, మొట్లవాగు, కోడిపుంజుల వాగు పూడికతీత పనులకు ప్రత్యేక నిధులు కేటాయించింది.
వేలాది మందికి ఉపాధి..
సింగరేణిలోని మణుగూరు ఏరియాపై వేలాది మంది ఆధారపడి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి పొందుతున్నారు. గనుల్లో ఉండే కాంట్రాక్ట్ అవకాశాల్లో భూ నిర్వాసితులకు ప్రాధాన్యం ఇస్తూనే ఓసీల్లో ఔట్ సోర్సింగ్ పనుల్లో డ్రైవర్లు, బొగ్గు రవాణా, బెల్ట్ క్లీనింగ్, ఓబీ కంపెనీల్లో వర్కర్లు, సింగరేణి ఆస్తుల పరిరక్షణలో సెక్యూరిటీలు, సేల్ పికింగ్ వంటి కాంట్రాక్ట్ పనుల్లో ప్రస్తుతం సుమారు 3,400 మంది ఉపాధి పొందుతున్నారు. దేశవ్యాప్తంగా మణుగూరులోని సింగరేణి బొగ్గుకు డిమాండ్ ఉండటంతో అనుసంధానంగా ఏర్పడిన బీటీపీఎస్, హెవీవాటర్ ప్లాంట్‌లకు లారీల ద్వారా, బకెట్ల ద్వారా బొగ్గును సరఫరా చేస్తూనే స్థానిక వ్యాపారులకు అవకాశాలు కల్పించి లారీల ద్వారా బొగ్గును కేటీపీఎస్, ఏపీ జెన్కో, తమిళనాడు, కర్ణాటక విద్యుత్ కర్మాగారాలకు లారీల ద్వారా బొగ్గును తరలిస్తున్నది. స్థానిక లారీ యజమానులకు జీవనోపాధిని కల్పిస్తోంది.
ప్రజాభిప్రాయ సేకరణకు సర్వం సిద్ధం
మణుగూరు ఓసీ విస్తరణలో భాగంగా ఇప్పటికే భూ సేకరణపై పిసా గ్రామసభల్లో ప్రజామోదం లభించగా, ప్రస్తుతం సర్వే దశలో ఉంది. ఈ నేపథ్యంలో ప్రజాభిప్రాయ సేకరణలో భాగంగా పర్యావరణ అనుమతుల కోసం బుధవారం ఏరియాలోని నేతాజీ గ్రౌండ్ వద్ద సభ నిర్వహణకు ఏర్పాట్లు చేశారు. 1500 – 2000 మంది స్థానిక ప్రజలు సభకు రానున్నారు. సభ ఆమోదం ద్వారా పర్యావరణ అనుమతులతో మణుగూరు ఓసీ విస్తరణకు మార్గం సుగమం కానుంది. వానాకాలాన్ని దృష్టిలో పెట్టుకుని ప్రత్యేక శామియానాల ఏర్పాటుతో పాటు ప్రత్యేక పార్కింగ్ స్థలం, ప్రత్యేక భోజన ప్రదేశాలు ఏర్పాటు చేసింది. అవాంఛనీయ ఘటనలు జరగకుండా డీఎస్పీ రవీందర్‌రెడ్డి, సీఐ నాగబాబు సభాస్థలిని పరిశీలించారు. ఏరియా జీఎం దుర్గం రాంచందర్, ఎస్‌ఓటూ జీఎం శ్రీనివాసాచారి, డీజీఎం (పర్సనల్) రమేశ్, ఎస్టేట్స్ అధికారి బాబుల్‌రాజు, పర్యావరణ అధికారి శ్రీనివాస్, సెక్యూరిటీ అధికారి శ్రీనివాస్ పనులు పర్యవేక్షించారు.
మణుగూరు అభివృద్ధికి సింగరేణి సహకారం అందిస్తోంది. ప్రజాప్రతినిధుల విజ్ఞప్తులను పరిగణనలోకి తీసుకుని ఏటా నిధులు కేటాయిస్తోంది. స్థానిక ప్రజల విషయంలో సహృదయంతో ప్రవర్తిస్తూ ఉపాధి కల్పనతో పాటు సమీప గ్రామాల అభివృద్ధికి సింగరేణి సహకారం ఎల్లవేళలా ఉంటుంది.
–దుర్గం రాంచందర్, ఏరియా జీఎం

మణుగూరుపై సింగరేణి ముద్ర