
ఆవుపేడ పొడితో గణపతి విగ్రహాలు
నిమజ్జనం తర్వాత
ఎరువుగా ఉపయోగం
గోశాల నిర్వాహకుల వినూత్న ప్రయత్నం
ఖమ్మంఅర్బన్: ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్‌తో చేసే వినాయక విగ్రహాలను నిమజ్జనం చేయడం ద్వారా జలాశయాలు కలుషిమవుతున్నాయి. ఈ విషయమై అవగాహన పెరగడంతో కొన్నేళ్లుగా చాలామంది మట్టితో చేసిన ప్రతిమలను పూజిస్తున్నారు. ఈక్రమంలో ఖమ్మం 7వ డివిజన్ టేకులపల్లిలోని శ్రీ వెంకటేశ్వర గోశాల నిర్వాహకులు ఆరుట్ల శ్రీనివాసాచార్యులు, ఆరుట్ల శ్రీరామ్ ఇంకో అడుగు ముందుకేశారు. గోశాలలో పెద్దసంఖ్యలో ఆవులను సంరక్షిస్తుండగా.. వీటి పేడను ఎండబెట్టి పొడిగా మార్చి వినాయక విగ్రహాలు రూపొందిస్తున్నారు. ఎలాంటి రసాయనాలు వాడకుండా తయారుచేసే ఈ ప్రతిమలను పూజలు చేశాక నిమజ్జనం చేస్తే నేలలో కలిసి ఎరువులుగా మారతాయి. ఒక్కో విగ్రహాన్ని రూ.100తో విక్రయిస్తుండడంతో భక్తులు కొనుగోలుకు ముందుకొస్తున్నారు. ఇలా వచ్చే ఆదాయాన్ని గోశాలలోని పశువుల దాణా, సంరక్షనకు వినియోగిస్తున్నామని శ్రీనివాసాచార్యులు తెలిపారు. కాగా, గతంలో ఆవుపేడ పొడితో రాఖీలు, దీపాంతలు కూడా తయారుచేశారు. అంతేకాక గోమూత్రంతో ఫినాయిల్ తయారుచేసి విక్రయిస్తున్నామని నిర్వాహకులు వెల్లడించారు.

ఆవుపేడ పొడితో గణపతి విగ్రహాలు