
మహిళ ఆత్మహత్యాయత్నం
పాల్వంచరూరల్: మంత్రాలు వస్తాయని ఆరోపిస్తూ ఓ వ్యక్తి తనపై దాడి చేసి అవమాన పర్చాడనే మనస్తాపంతో ఓ మహిళ పురుగుమందు తాగి ఆత్మహత్యాయత్నం చేసింది. పోలీసుల కథనం ప్రకారం.. మండలంలోని ఉల్వనూరు లక్ష్మీదేవిపల్లి గ్రామానికి చెందిన వల్లపు కుమారిని ఈ నెల 16వ తేదీన ఇంటి పక్కన ఉండే ఆటోడ్రైవర్ రాపోలు రవి నీకు మంత్రాలు వస్తాయంట కదా అని ఆరాతీశాడు. దీంతో ఆమె విషయాన్ని భర్తకు చెప్పింది. దంపతులిద్దరూ రవిని నిలదీశారు. గొడవపడ్డారు. మరుసటి రోజు గ్రామ పెద్దమనుషుల సమక్షంలో పంచాయితీ పెట్టారు. అదే రోజున కుమారి పురుగుమందు తాగగా కుటుంబ సభ్యులు ద్విచక్ర వాహనంపై పాల్వంచ ఆస్పత్రికి.. అక్కడి నుంచి కొత్తగూడెం ఏరియా ఆస్పత్రికి తరలించారు. కుమారి భర్త వెంకన్న ఫిర్యాదు మేరకు రవిపై కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ సురేశ్ తెలిపారు.
కూలిన పూరిల్లు
జూలూరుపాడు: మండలంలోని భోజ్యాతండా గ్రామ పంచాయతీ వెనకతండాకు చెందిన ధరావత్ జగ్గు పూరిల్లు మంగళవారం కూలిపోయింది. ఐదు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు పూరిల్లు నాని కుప్పకూలింది. ఆ సమయంలో ధరావత్ జగ్గు, ధర్మి దంపతులు బయట ఉండటంతో ప్రమాదం తప్పింది.
ద్విచక్రవాహనదారుడిపై కేసు
పాల్వంచరూరల్: రోడ్డుపై నిల్చున్న వ్యక్తి ద్విచక్రవాహనంతో ఢీకొట్టిన వ్యక్తిపై పోలీసులు మంగళవారం కేసు నమోదు చేశారు. పోలీసుల కథనం ప్రకారం.. పాల్వంచ కేటీపీఎస్ ఏ–కాలనీలో నివాసం ఉంటూ ఆర్టిజన్‌గా పనిచేస్తున్న కురుపావత్తు శ్రీనివాస్ ఈ నెల 14వ తేదీన జగన్నాథపురం గ్రామానికి వెళ్లి తిరిగి ఇంటికి వస్తూ.. కేశవాపురం వద్ద రోడ్డు పక్కన నిలబడి ఫోన్ మాట్లాడుతున్నాడు. అదే సమయంలో వెనుక నుంచి వేగంగా వచ్చిన ద్విచక్రవాహనం ఢీకొట్టడంతో శ్రీనివాస్ గాయపడ్డాడు. క్షతగాత్రుడి కుమారుడు వంశీ ఫిర్యాదు మేరకు బొల్లం నిఖిల్‌పై కేసు నమోదు చేశామని హెడ్ కానిస్టేబుల్ హరిబాబు తెలిపారు.
ఆటో పల్టీ.. మహిళకు తీవ్ర గాయాలు
ఇల్లెందు: ఆటో పల్టీకొట్టి మహిళ తీవ్రంగా గాయపడిన ఘటన పట్టణంలో మంగళవారం చోటుచేసుకుంది. వివరాలిలా ఉన్నాయి.. స్థానిక బస్టాండ్ నుంచి గుండా ల బస్ బయలు దేరింది. అదే గ్రామానికి చెందిన నూనావత్ స్వప్న బస్సును అందుకోలేకపోయింది. ఓ ఆటో మాట్లాడి బస్సును ఆందుకోవాలని చెప్పింది. డ్రైవ ర్ ఆటోను బస్ కోసం వేగంగా నడుపుకుంటూ వెళ్లడంతో చెరువు కట్ట సమీపంలో పల్టీ కొట్టింది. ఆటోలో ఉన్న స్వప్న తీవ్రంగా గాయపడగా.. ఖమ్మం తరలించారు.