
రోడ్డు గుంతలమయం..
● వాహనదారుల అష్టకష్టాలు ● నిద్రావస్థలో అధికారులు..
టేకులపల్లి: మండల కేంద్రం నుంచి బొమ్మనపల్లి వరకు రోడ్డు గుంతలమయంగా మారింది. మండల కేంద్రంలోని ప్రధాన సెంటర్‌లోని ఎన్‌హెచ్ 930పీ రహదారిలో పెద్ద గుంత ఏర్పడి మంగళవారం ఓ గంట వ్యవధిలోనే పదుల సంఖ్యలో వాహనాలు అదుపుతప్పాయి. అందులో పలువురు గాయపడగా.. స్థానికులు ఆస్పత్రికి తరలించారు. అంతేకుండా ఈ రోడ్డుపై ఏర్పడిన గుంతలతో వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారనే అంశంపై ‘సాక్షి’తోపాటు మీడియాలో వార్తలు వచ్చాయి. అంతేకాకుండా సోమవారం మండలంలో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ఎమ్మెల్యేలు కోరం కనకయ్య, మాలోత్ రాందాస్‌నాయక్‌ల పర్యటించారు. వారి వాహనాలు కూడా ఈ గుంతల్లో నుంచి ఇబ్బందికరంగా వెళ్లాయి. అయినప్పటికీ అధికారుల్లో చలనం రావడం లేదు. ఇదిలా ఉండగా.. గుంతలు లోతుగా ఉండటం, ప్రస్తుతం వర్షాలు పడుతుండటంతో నీరు నిండి లోతు అంచనా వేయలేక ద్విచక్రవాహనదారులు అదుపుతప్పి కింద పడుతున్నారు. ఆటోలు, మ్యాజిక్ లాంటి వాహనాలు గుంతల్లో ఇరుక్కుపోతున్నాయి. స్థానికులు స్పందించి గుంత ఉన్న ప్రాంతంలో ఎర్రజెండా పెట్టారు. ఇప్పటికై నా సంబంధిత శాఖాధికారులు స్పందించి తక్షణమే మరమ్మతులు చేయించాలని స్థానికులు కోరుతున్నారు.

రోడ్డు గుంతలమయం..