
పెళ్లికి నిరాకరించిన ప్రియుడు
● మనస్తాపంతో పురుగుమందు తాగిన యువతి ● చికిత్స పొందుతూ మృతి
టేకులపల్లి: ప్రియుడు పెళ్లికి నిరాకరిండచంతో మనస్తాపానికి గురైన యువతి పురుగుమందు తాగింది. కుటుంబ సభ్యులు ఆస్పత్రిలో చేర్పించడంతో మృత్యువుతో పోరాడి మృతి చెందింది. ఎస్‌ఐ రాజేందర్ కథనం ప్రకారం.. మండలంలోని కొత్తతండా (జీ) పంచాయతీ వెంకట్యాతండాకు చెందిన గుగులోత్ వీరమోహన్ కుమార్తె తుళ్లికశ్రీ (20)ని లక్ష్మీదేవిపల్లి మండలం సీతారాంపురం పంచాయతీ రూప్లాతండాకు చెందిన బానోతు బిచ్చా పెళ్లి చేసుకుంటానని మూడు నెలల కిందట ఒప్పుకున్నాడు. అనంతరం యువతిని బిచ్చా భద్రాచలం, కొత్తగూడెంతోపాటు పలు ప్రాంతాలకు తీసుకెళ్లాడు. ఒకరోజు తుల్లికశ్రీ వేరే అబ్బాయితో మాట్లాడుతోందని అవమానించి, పెళ్లి చేసుకోనని ఫోన్‌లో బిచ్చా మెసేజ్‌లు పెట్టాడు. దీంతో మనస్తాపం చెందిన యువతి ఈ నెల 13న ఇంట్లో ఎవరూ లేని సమయంలో పురుగుమందు తాగింది. కుటుంబ సభ్యులు కొత్తగూడెంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి.. అక్కడి నుంచి హైదరాబాద్‌లోని ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్చారు. యువతి బాబాయి రాజేందర్ ఈ నెల 15న పోలీస్ స్టేసన్‌లో ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేశారు. మంగళవారం యువతి మృతిచెందడంతో ఆ కుటుంబంలో విషాదం నెలకొంది.