
ఎన్నడూ ఎరగని కష్టం..
యూరియా కోసం రైతుల అగచాట్లు వర్ణతీతం
తెల్లవారుజాము నుంచే సొసైటీ
కార్యాలయం వద్దకు వస్తున్న
అన్నదాతలు
పోలీసుల పహారా మధ్య కూపన్ల
పద్ధతిలో యూరియా పంపిణీ
వారం నుంచి తిరుగుతున్నా యూరియా అందలేదు
పదెకరాలుంటే మూడు కట్టలిచ్చారు..
తల్లాడ/సుజాతనగర్/కరకగూడెం/బూర్గంపాడు: యూరియా కోసం కనివినీఎరుగని కష్టం రైతులకొచ్చింది. యూరియా కోసం ఎన్నడూ తిప్పలు పడని రైతులు.. ప్రస్తుతం నానా అవస్థలు పడుతున్నారు. తెల్లవారింది మొదలు యూరియా కోసం పరుగులు పెడుతున్నారు. ఉదయం నాలుగు గంటలకే సొసైటీ కార్యాలయాల వద్ద బారులుదీరుతున్నారు. సోమవారం తెల్లవారుజామున 4 గంటల నుంచే తల్లాడ సొసైటీ కార్యాలయం వద్ద క్యూకట్టారు. తల్లాడ సొసైటీకీ 911 కట్టల యూరియా వచ్చిందనే సమాచారం తెలియడంతో రైతులు పెద్ద సంఖ్యలో అక్కడికి చేరుకున్నారు. అతి పెద్ద సొసైటీ అయిన తల్లాడలో 15 గ్రామాలున్నాయి. ఈ గ్రామాలకు చెందిన వెయ్యి మంది రైతులు సొసైటీ కార్యాలయానికి వచ్చారు. వచ్చిన వారందరికీ యూరియా ఇవ్వాలనీ రైతులు పట్టుబట్టారు. బీజేపీ జిల్లా నాయుకులు ఆపతి వెంకటరామారావు ఆధ్వర్యంలో సొసైటీ కార్యాలయం ఎదుట బైఠాయించి ఆందోళన చేపట్టారు. తల్లాడ మండల వ్యవసాయాధికారి ఎండీ తాజుద్దీన్, ట్రెయినీ ఎస్‌ఐ వెంకటేశ్, సొసైటీ సీఈఓ నాగబాబు ఆధ్వర్యంలో రైతులకు కూపన్లు పంపిణీ చేశారు. వచ్చిన ప్రతి రైతుకు ఒక కూపన్ చొప్పున పాస్‌బుక్, ఆధార్‌కార్డు జిరాక్స్‌లను పరిశీలించి అందించారు. ఈ కూపన్లు పొందిన రైతులకు మాత్రమే యూరియా కట్టలందజేశారు. కూపన్లు అందని రైతులు అధికారులతో వాగ్వాదానికి దిగారు. ఒకే రోజు యూరియా కట్టలు పంపిణీ చేయడం వీలు పడక మంగళవారం నాడు కూపన్లు పొందిన రైతుల్లో సగంమందికి యూరి యా పంపిణీ చేస్తామని అధికారులు ప్రకటించారు. ఓ పక్క వర్షం పడుతున్నా రైతులు యూరియా కోసం తడుచుకుంటూనే నిల్చున్నారు. యూరియా కొరత కారణంగా వచ్చిన వారిలో చాలా మందికి యూరియా అందలేదు. యూరియా వేయాల్సిన తరుణంలో కొరత ఏర్పడటంతో ఏం చేయాలో దిక్కుతోచని స్థితిలో రైతులు కొట్టుమిట్టాడుతున్నా రు. ఇక సుజాతనగర్ సొసైటీ గోదాముకు యూరి యా వచ్చిన విషయం తెలుసుకున్న ఆయా గ్రామాలకు చెందిన పురుషులు, మహిళా రైతులు సోమవారం పెద్దఎత్తున తరలివచ్చారు. వ్యవసాయ పనులు ఊపందుకోవడంతో యూరియా అవసరం పెరిగింది. ఆధార్‌కార్డుకు ఒకే బస్తా చొప్పున ఇస్తామని చెప్పడంతో రైతులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. గంటల తరబడి వేచి ఉన్నా కొందరికే యూరియా బస్తాలు అందడంతో మరికొందరు బస్తాలు దొరక్క నిరాశతో వెనుదిరిగారు. అవసరానికి మించి యూరియాను కొనుగోలు చేసి నిల్వ ఉంచుకోవద్దని ఏఓ నర్మద తెలిపారు. మండలంలో రైతులందరికీ సరిపడా యూరియాను సరఫరా చేసేందుకు వ్యవసాయశాఖ సిద్ధంగా ఉందని చెప్పారు. కాగా, రైతులకు సరిపడా యూరియా అందించడంలో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని కౌలు రైతు సంఘం రాష్ట్ర నాయకులు నల్లగోపు పుల్లయ్య ఆరోపించారు. అలాగే, కరకగూడెంలోని ప్రాథమిక సహకార సంఘం సేల్ పాయింట్ వద్ద రైతులు జోరు వానను సైతం లెక్కచేయకుండా క్యూలో నిలబడి యూరియా కోసం నిరీక్షించారు. గొడుగు లు పట్టుకుని, రెయిన్ కోట్లు వేసుకుని ఉదయం నుంచి సాయంత్రం వరకు నిరీక్షించినా కొందరు రైతులకు మాత్రమే యూరియా అందింది. స్టాక్ అయిపోవడంతో పలువురు ఖాళీ చేతులతోనే వెనుదిరగాల్సి వచ్చింది. దీంతో రైతులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అలాగే, బూర్గంపాడు మండలంలోని మోరంపల్లిబంజర పీఏసీఎస్ గోదాంకు వచ్చిన ఒక లారీ యూరియా కోసం సుమారు 500 మంది రైతులు రాగా.. పంపిణీ చేసేందుకు అధికారులు కూడా ఇబ్బంది పడ్డారు. రైతుకు ఒక యూరియా బస్తా చొప్పున విక్రయించారు. అయినప్పటికీ ఇంకా చాలామంది రైతులకు అందక నిరాశగా వెనుదిరిగారు.
వారం రోజులుగా యూరియా కోసం తల్లాడ సొసైటీ కార్యాల యం వద్దకు వచ్చి పోతున్నా ను. యూరియాఒక్కకట్ట కూడా ఇవ్వ లేదు. యూరియా వేయాల్సిన తరుణంలో అందక పోవటంతో ఇబ్బంది పడాల్సి వస్తోంది. గతంలో ఎన్నడూ ఇంత ఇబ్బంది పడలేదు. యూరియా లోడ్ వచ్చిన రోజు ముందు వచ్చిన రైతులకే కూపన్లు ఇస్తున్నారు. చుట్టు పక్కల గ్రామాల రైతులు వచ్చే సరికి కూపన్లు అయిపోయాయని చెబుతున్నారు.
– వి.వంశీకృష్ణారెడ్డి, రైతు, పినపాక
పదెకరాలుంటే మూడు యూరి యా కట్టలు కూపన్ల పద్ధతిలో ఇచ్చారు. కూపన్ల కోసం గంటల తరబడి వేచి చూడాల్సి వచ్చింది. ఎకరానికి ఒక కట్ట తప్పనిసరిగా యూరియా వేయాలి. దీంతో ఇంకా ఏడు కట్ట లు అసవరం ఉన్నది. అధికారులను అడిగితే మళ్లీ లోడ్ వస్తే ఇస్తామంటున్నారు. యూరియా కొరత వేధిస్తోంది.
–కొలిపాక శ్రీనివాసరావు, రైతు, బిల్లుపాడు

ఎన్నడూ ఎరగని కష్టం..

ఎన్నడూ ఎరగని కష్టం..

ఎన్నడూ ఎరగని కష్టం..