
ఇంత జరిగినా నిర్లక్ష్యమే..
ఉప ముఖ్యమంత్రి ఆగ్రహం..
● కల్లూరు గిరిజన ఆశ్రమ పాఠశాలలో మళ్లీ ఫుడ్ పాయిజన్ ● ఐటీడీఏ పీఓ హెచ్చరించినా తీరుమారని అధికారులు ● సాయంత్రం స్నాక్స్‌ను రాత్రి భోజనంలో పెట్టిన వైనం ● స్వాతంత్య్ర వేడుకల స్టాళ్ల ప్రదర్శనలోనూ బయటపడిన నిర్లక్ష్యం
ఖ్మంమయూరిసెంటర్: సంక్షేమ శాఖల వసతి గృహాల నిర్వహణపై అధికారుల నిర్లక్ష్యం మరోసారి బట్టబయలైంది. విద్యార్థులకు సురక్షితమైన వసతి, భోజన సదుపాయాలు కల్పించాల్సిన బాధ్యతను పక్కన పెట్టి, వారి ఆరోగ్యాన్ని గాలికొదిలేస్తున్నార న్న ఆరోపణలు వస్తున్నాయి. 14రోజుల వ్యవధిలోనే ఒకే ఆశ్రమ పాఠశాలలో రెండు సార్లు విద్యార్థి నులు ఫుడ్‌పాయిజన్‌కు గురికావడం తీవ్ర ఆందో ళన కలిగిస్తోంది. ఐటీడీఏ పీఓ హెచ్చరించినా.. జిల్లా అధికారులు, స్థానిక అధికారులు, సిబ్బందిలో మార్పు రాకపోవడంపై తీవ్ర ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. జిల్లాలోని కల్లూరు గిరిజన ఆశ్రమ పాఠశాలలో శనివారం రాత్రి తిన్న భోజనంతో విద్యార్థులు అస్వస్థతకు గురికావడం అధికారులు, సిబ్బంది అలసత్వానికి నిదర్శనమని విద్యార్థుల తల్లిదండ్రులు, విద్యార్థి సంఘాల నేతలు విమర్శిస్తున్నారు.
వరుస ఘటనలు..
కల్లూరు గిరిజన బాలికల ఆశ్రమ పాఠశాలలో ఈ నెల 3న ఆదివారం అధికారులు, సిబ్బంది నిర్లక్ష్యంతో మధ్యాహ్నం వండిన చికెన్ రాత్రి తినడం, ఆ మరునాడే ఉదయం ఉడికి ఉడకని కిచిడి తినడంతో 15 మందికి పైగా విద్యార్థినులు అస్వస్థతకు గురయ్యారు. ఆ ఘటన మరువక ముందే ఈ నెల 16న శనివారం సాయంత్రం విద్యార్థినులకు అందించాల్సిన స్నాక్స్ (క్యాబేజీ పకోడి) రాత్రి భోజనంతో పాటు అందించడంతో పలువురు విద్యార్థినులు అస్వస్థతకు గురయ్యారు. ఒకే ఆశ్రమ పాఠశాలలో వరుసగా రెండు ఘటనలు చోటు చేసుకోవడంతో నిర్వహణ, జిల్లా అధికారుల పర్యవేక్షణ ఏస్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు.
సమయపాలన లేదు..
గిరిజన సంక్షేమ వసతిగృహాలు, ఆశ్రమ పాఠశాల ల్లో విద్యార్థులకు అందించాల్సిన అల్పాహారం, భోజనం, స్నాక్స్ వంటి వాటికి సమయపాలన లేదనే విమర్శలు వస్తున్నాయి. మధ్యాహ్నం వండిన చికెన్ సాయంత్రం, సాయంత్రం 4 గంటల సమయంలో అందించాల్సిన స్నాక్స్ రాత్రి భోజనంతో పెడుతున్నారు. జిల్లాలోని అన్ని గిరిజన వసతిగృహాలు, ఆశ్రమ పాఠశాలల్లో ఇలానే జరుగుతోందా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కల్లూరులో శనివారం సాయంత్రం తయారు చేసిన స్నాక్స్ రాత్రి భోజనంతో అందించడంపై అధికారులు ఆరా తీ యగా.. హెచ్‌ఎం సరుకులు ఆలస్యంగా ఇచ్చా రని వర్కర్లు, వర్కర్ ఆలస్యంగా వంట తయారు చేశా రని హెచ్‌ఎం ఫిర్యాదు చేసినట్లు సమాచారం. కాగా, కల్లూరు ఆశ్రమ పాఠశాలలో ఐటీడీఏ పీఓ పర్యటించి వార్డెన్ నిర్లక్ష్యంతోనే ఫుడ్ పాయిజన్ జరిగినట్లు నిర్ధారించి సస్పెండ్ చేశారు. ఆహారం తయారు చేసిన సిబ్బందిపై చర్యలు తీసుకోలేదు. ఇలాంటి ఘటనలు పునరావృతం కావొద్దని అధికారులు, హెచ్‌ఎంలు, వసతిగృహ సంక్షేమ అధికారులను హెచ్చరించారు. అయినా వారు సీరియస్‌గా తీసుకున్నట్లు కనిపించడం లేదు. అదే ఆశ్రమ పాఠశాలలో మరో ఘటన చోటు చేసుకుందనే ఆరోపణలు ఉన్నాయి. వంట చేసిన వారిని అధికారులు వేరే వసతిగృహానికి మార్చి చేతులు దులుపుకున్నట్లు తెలిసింది.
గిరిజన అభివృద్ధి శాఖ అధికారుల నిర్లక్ష్యం రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ముందే బయటపడింది. ఈ నెల 15న స్వాతంత్య్ర వేడుకల సందర్భంగా పోలీస్ పరేడ్ మైదానంలో వేడుకలు నిర్వహించారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క.. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ సంక్షేమశాఖల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన స్టాళ్లలో నోట్‌బుక్స్‌పై కేసీఆర్, సత్యవతిరాథోడ్ ఫొటోలు ఉండడంతో తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇదిలా ఉండగా.. కల్లూరు ఆశ్రమ పాఠశాల ఘటనపై జిల్లా గిరిజన అభివృద్ధి అధికారిణి విజయలక్ష్మిని వివరణ కోరగా.. సాయంత్రం చేసిన స్నాక్స్ రాత్రి భోజనంతో పాటు తినడంతో విద్యార్థినులకు కడుపునొప్పి వచ్చిందని, ఘటనలో వర్కర్‌ను అక్కడి నుంచి మార్చామని తెలిపారు.