
నవంబర్‌లో పీడీఎస్‌యూ రాష్ట్ర మహాసభలు
ఖమ్మంమయూరిసెంటర్: ఖమ్మం జిల్లా కేంద్రంలో నవంబర్ మూడో వారంలో పీడీఎస్‌యూ రాష్ట్ర 23వ మహాసభలు నిర్వహించనున్నామని సంఘం రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు కాంపాటి పృథ్వీ, అనిల్ సాయిబోలా అన్నారు. సోమవారం ఖమ్మంలోని రామనర్సయ్య విజ్ఞాన కేంద్రంలో వారు విలేకరులతో మాట్లాడారు. 1960 దశకం చివరిలో ఉస్మానియా యూనివర్సిటీ కేంద్రంగా పీడీఎస్‌యూ పురుడు పోసుకుందని, జార్జిరెడ్డి, జంపాల చంద్రశేఖర ప్రసాద్, శ్రీపాద శ్రీహరి, కొలా శంకర్, చేరాలు వంటి ఎంతోమంది.. విద్యార్థుల హక్కుల కోసం, శాసీ్త్రయ విద్య, సమానత్వ సమాజ స్థాపనను కాంక్షిస్తూ విద్యార్థి ఉద్యమంలో అమరులయ్యారన్నారు. ఎన్నో సామాజిక, ప్రజాతంత్ర, విప్లవోద్యమాలకు పురిటిగడ్డ అయిన ఖమ్మం జిల్లా కేంద్రంలో పీడీఎస్‌యూ రాష్ట్ర మహాసభలను నిర్వహించనున్నామని, వీటిని విజయవంతం చేయాలని కోరారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం విద్యారంగాన్ని కాషాయీకరించేందుకు దుర్మార్గ సంస్కరణలకు పూనుకుంటోందన్నారు. సమావేశంలో పీడీఎస్‌యూ రాష్ట్ర ఉపాధ్యక్షులు బి.నరసింహారావు, నరేందర్, అఖిల్ కుమార్, సహాయ కార్యదర్శి వెంకటేశ్, ఎస్.సాయికుమార్, సురేశ్, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు లక్ష్మణ్, అంగిడి కుమార్, అలవాల నరేశ్, మునిగల శివ, అజయ్, నాగరాజు, అషూర్, రాందాస్ తదితరులు పాల్గొన్నారు.
సంఘం రాష్ట్ర అధ్యక్ష,
కార్యదర్శులు పృథ్వీ, అనిల్