
హత్య కేసులో నిందితుల అరెస్ట్
బూర్గంపాడు: హత్య కేసులో ఇద్దరు నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్‌కు పంపినట్లు ఇన్‌చార్జ్ సీఐ నాగరాజు తెలిపారు. సోమవారం బూర్గంపాడు పోలీస్‌స్టేషన్‌లో ఆయన వివరాలు వెల్లడించారు. ఈ నెల 11న గ్యాస్ సిలిండర్ అపహరించాడనే కారణంతో అశ్వాపురం మండలం మల్లెలమడుగు గ్రామానికి చెందిన కడియం సర్వేశ్వరరావు(32)పై ఇద్దరు వ్యక్తులు సిమెంట్ డంబెల్స్‌తో దాడికి పాల్పడ్డారు. తీవ్రంగా గాయపడిన సర్వేశ్వరరావును వరంగల్ ఎంజీఎంకు తరలించగా.. అక్కడ చికిత్స పొందుతూ 16న మృతి చెందాడు. మృతుడి తల్లి కడియం రమణమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. టేకులపల్లి మండలం బొమ్మనపల్లి గ్రామానికి చెందిన కొండల సంతోష్, అదే గ్రామానికి చెందిన చర్లపల్లి శివ ఈ హత్యకు పాల్పడినట్లు విచారణలో తేలింది. బొమ్మనపల్లిలోని చర్లపల్లి శివ ఇంటి నుంచి గ్యాస్ సిలిండర్‌ను చెప్పకుండా సర్వేశ్వరరావు తీసుకొచ్చాడనేకారణంతో నిందితులు సర్వేశ్వరరావుతో గొడవ పడి, దాడి చేశారని సీఐ చెప్పారు. విచారణ అనంతరం నిందిలిద్దరిని అరెస్ట్ చేసి కోర్టులో హాజరు పరిచినట్లు తెలిపారు. సమావేశంలో బూర్గంపాడు ఎస్‌ఐలు మేడ ప్రసాద్, దేవ్‌సింగ్ ఉన్నారు.