గిరిజన మార్ట్‌ ఏర్పాటు చేయరూ.. | - | Sakshi
Sakshi News home page

గిరిజన మార్ట్‌ ఏర్పాటు చేయరూ..

Aug 19 2025 4:52 AM | Updated on Aug 19 2025 4:52 AM

గిరిజన మార్ట్‌ ఏర్పాటు చేయరూ..

గిరిజన మార్ట్‌ ఏర్పాటు చేయరూ..

మహిళా మార్ట్‌ స్ఫూర్తితో..

అటవీ, సంప్రదాయ వస్తువులు ఒకేచోట లభించే సౌకర్యం

భక్తులు, పర్యాటకుల గిరాకీతో గిరిజనుల ఆర్థికాభివృద్ధి

మహిళా మార్ట్‌ను స్ఫూర్తిగా తీసుకోవాలంటున్న ఆదివాసీ సంఘాలు

భద్రాచలం: భద్రాచలం ఏజెన్సీ అటవీ వస్తువులు, ఉత్పత్తులు, గిరిజనుల ఆహార శైలితో విభిన్నత చాటుకుంటోంది. వాటి సంరక్షణకు, ప్రచారానికి ఐటీడీఏ కృషి చేస్తోంది. అవన్నీ ఒకేచోట లభించేలా గిరిజన మార్ట్‌ ఏర్పాటు చేస్తే మరింత ప్రాచుర్యం లభిస్తుంది. గిరిజనులు ఆర్థికాభివృద్ధి సాధించడంతోపాటు భక్తులు, పర్యాటకులు కొనుగోలు చేసుకునేందుకు సులభంగా ఉంటుందని ఆదివాసీ సంఘాలు పేర్కొంటున్నాయి.

ప్రాభవం కోల్పోతున్న గిరిజన స్టోర్‌లు

గిరిజనులు సేకరించే జిగురు, తేనె, కుంకుడు వంటి అటవీ ఉత్పత్తులు గిరిజన సహకార సంస్థ(జీసీసీ) ద్వారా కొనుగోలు చేస్తున్నారు. ప్రధాన పట్టణాల్లో గిరి బజార్‌ పేరిట ఏర్పాటు చేసిన జీసీసీ స్టోర్లలోవిక్రయిస్తున్నారు. కొంతకాలంగా ఇవి ప్రాభవం కోల్పోతున్నాయి. గిరిజనులు సేకరించే ఉత్పత్తులూ తగ్గిపోతున్నాయి. ఈ క్రమంలో సమూల ప్రక్షాళన చేసి అన్ని ఉత్పత్తులు ఒకే చోట విక్రయించేలా గిరిజన మార్ట్‌ ఏర్పాటు చేయాలని పలువురు కోరుతున్నారు.

గిరిజన మ్యూజియం ఏర్పాటు చేసినా..

భద్రగిరి మన్యం ఆదివాసీ సంస్కృతి, సంప్రదాయాలతో దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకుంది. ఇక్కడ వారి జీవనవిధానం, వ్యవసాయానికి, గృహ అవసరాలకు వాడే పరికరాలు, వస్తువులు, ఆహారం విభిన్నంగా ఉంటాయి. వెదురుతో తయారుచేసే బొమ్మలు, అల్లికలు, ఆటవస్తువులు ఆకట్టుకుంటాయి. వీటన్నింటికీ ప్రాచుర్యం కల్పించేలా ఐటీడీఏ పీఓ రాహుల్‌ చొరవతో గిరిజన మ్యూజియం ఏర్పాటు చేశారు. కానీ పూర్తిస్థాయిలో భక్తులకు, పర్యాటకులకు అందుబాటులోకి రాలేదు. ఈ క్రమంలో వీటన్నింటిని ఒక్క చోటకు చేర్చి, నిర్వహణ బాధ్యతలను గిరిజన మహిళలు, నిరుద్యోగుల సమాఖ్యలకు అప్పగించాలని పలువురు కోరుతున్నారు.

భద్రాచలంలో గిరిజన మహిళలు పారిశ్రామికవేత్తలుగా రూపుదిద్దుకుంటున్నారు. వారు తయారు చేస్తున్న మిల్లెట్‌ బిస్కెట్లు, సబ్బులు, షాంపులు ఆదరణ పొందుతున్నాయి. ప్రధాన మంత్రి మోదీ సైతం మన్‌కీబాత్‌లో ప్రస్తావించారు. దీంతో దేశస్థాయిలో ప్రచారం లభించింది. వస్తువుల విక్రయానికి ఐటీడీఏ మ్యూజి యంలో, దేవస్థానం, పట్టణంలో కేంద్రాలు ఏర్పాటు చేశారు. జీసీసీలో లభించే ఉత్పత్తులు, గిరిజన మహిళా పారిశ్రామిక వేత్తలు తయారు చేసే ప్రొడక్ట్స్‌, ఆదివాసీల సంప్రదాయ వస్తువులతో గిరిజన మార్ట్‌ ఏర్పాటు చేయాలని ఆదివాసీ నాయకులు కోరుతున్నారు. ఇటీవల ఖమ్మంలో ఏర్పాటు చేసిన మహిళా మార్ట్‌తో ఐటీడీఏ పీఓ రాహుల్‌, ఇతర అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని పేర్కొంటున్నారు. రద్దీగా ఉండే దేవస్థానం పరిసర ప్రాంతాల్లో, ఆర్టీసీ బస్టాండ్‌ల వద్ద వీటిని ఏర్పాటు చేయాలని విన్నవిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement