
ముత్తంగి అలంకరణలో రామయ్య
భద్రాచలం: శ్రీసీతారామ చంద్రస్వామి దేవస్థానంలోని మూలమూర్తులు సోమవారం ముత్తంగి అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చి కనువిందు చేశారు. ప్రతీ సోమవారం స్వామివారిని ముత్తంగి రూపంలో అలంకరిస్తారు. తొలుత తెల్లవారుజామున గర్భగుడిలో స్వామివారికి సుప్రభాత సేవ, సేవాకాలం, ఆరాధన తదితర పూజలు చేశారు. అనంతరం నిత్యకల్యాణానికి బేడా మండపంలో కొలువుదీరిన స్వామివారికి విశ్వక్సేన పూజ, పుణ్యావాచనం చేశారు. స్వామి వారికి కంకణధారణ, యజ్ఞోపవీత ధారణ, అమ్మవారికి కంకణ, యోక్త్రధారణ గావించి నిత్యకల్యాణ ఘట్టాన్ని ఆలయ అర్చకులు శాస్త్రోక్తంగా జరిపారు.
23న జాబ్‌మేళా
భద్రాచలం: ఈ నెల 23న భద్రాచలంలో జాబ్‌మేళా నిర్వహించనున్నట్లు ఐటీడీఏ పీఓ బి.రాహుల్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల పరిధిలోని గిరిజన నిరుద్యోగులకు ప్రైవేటు రంగంలో ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు ఈ కార్యక్రమం ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. ఎంపికై న అభ్యర్థులు హైదరాబాద్‌లోని బయోకాన్ కంపెనీలో అప్రెంటిస్‌గా పనిచేయాలని సూచించారు. బీఎస్సీ కెమిస్ట్రీ, ఎమ్మెస్సీ కెమిస్ట్రీ, డిప్లొమా కెమికల్, బీటెక్ కెమికల్ చదివినవారు అర్హులని తెలిపారు. అప్రెంటిస్ శిక్షణలో నెలకు రూ. 10,000 స్టైఫండ్ ఇస్తారని పేర్కొనానరు. ఆసక్తి కలిగినవారు ఐటీడీఏలో యూత్ ట్రైనింగ్ సెంటర్‌లో హాజరు కావాలని కోరారు.
పీహెచ్‌సీలో
డీఎంఓ తనిఖీ
చర్ల: మండలంలోని సత్యనారాయణపురం ప్రభుత్వ వైద్యశాలను జిల్లా మలేరియా ప్రోగ్రాం అధికారి(డీఎంఓ) డాక్టర్ స్పందన సోమవారం తనిఖీ చేశారు. రిజిస్టర్లు, ల్యాబ్‌ను పరిశీలించారు. బాధితులను అడిగి వైద్యం అందుతున్న తీరును తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ వైద్యశాలలో నిర్వహించే ప్రతీ రక్త పరీక్షకు సంబంధించిన రక్త నమూనాను టీ హబ్‌కు కూడా పంపాలని ఆదేశించారు. ఆర్‌ఎంపీలతో సమావేశాలను నిర్వహించి పరిధికి మించి చికిత్స అందించకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
విద్యార్థులకు
తపాలా స్కాలర్‌షిప్‌లు
ఖమ్మంగాంధీచౌక్ : దీన్ దయాళ్ స్పర్శ యోజన పథకం కింద 2025 – 26 సంవత్సర పిలాటలీ స్కాలర్‌షిప్ పథకానికి 6 నుంచి 9వ తరగతి మధ్య చదువుతున్న విద్యార్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ఖమ్మం డివిజన్ పోస్టల్ సూపరింటెండెంట్ వి.వీరభద్ర స్వామి సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. పిలాటలీ క్విజ్, ప్రాజెక్టు కార్యక్రమాలను పోస్టల్ డివిజనల్, రీజనల్/సర్కిల్ స్థాయిలో నిర్వహించనున్నామని తెలిపారు. ప్రతిభ కనబర్చిన వారికి నెలకు రూ. 500 చొప్పున ఏడాదికి రూ. 6 వేలు అందిస్తామని తెలిపారు. దరఖాస్తులను ‘సూపరింటెండెంట్ ఆఫ్ పోస్టాఫీసెస్, ఖమ్మం డివిజన్, ఖమ్మం 507003’ అడ్రస్‌కు సెప్టెంబర్ 13 లోగా పంపించాలని తెలిపారు. మరిన్ని వివరాలు www.indiapost.gov.in వెబ్‌సైట్ ద్వారా తెలుసుకోవచ్చని సూచించారు.