ఆస్వాదిద్దాం | - | Sakshi
Sakshi News home page

ఆస్వాదిద్దాం

Aug 17 2025 6:35 AM | Updated on Aug 17 2025 6:35 AM

ఆస్వా

ఆస్వాదిద్దాం

ఘాట్‌రోడ్డులో ప్రయాణం.. సఫారీపై స్వారీ అరుదైన పక్షులు, ఔషధ మొక్కలకు ఆలవాలం ఉమ్మడి జిల్లా వాసులకు అందుబాటులో పర్యాటక కేంద్రం

అందాలు చూద్దాం..

సత్తుపల్లి: కనుచూపు మేర పచ్చని చెట్లు.. చల్లనిగాలులు.. పక్షుల కిలకిలారావాలు.. జాలువారే జలపాతాలు.. ఘాట్‌రోడ్‌పై వెళ్తుంటే మార్గమధ్యలో ఆలయాలు.. దూరంగా ఉమ్మడి జిల్లాకు సరిహద్దుగా కనిపించే కనిగిరి గుట్టలు.. అక్కడక్కడా అరుదైన నీలిరంగు పుట్టగొడుగులు, ఔషధ మొక్కలు.. ఈ అనుభూతులన్నీ మీ సొంతం కావాలంటే ఒక రోజు సమయం కేటాయించండి చాలు! ఎంతో దూరం వెళ్లాల్సిన పనికూడా లేదు. కుటుంబ సమేతంగా పెనుబల్లి మండలం పులిగుండాల ప్రాజెక్టు సందర్శనకు వెళ్తే మరిచిపోలేని అనుభూతులను మూటగట్టుకుని రావొచ్చు! ఈ ప్రాంతాన్ని ఎకో టూరిజంలో భాగంగా రూ.4.20కోట్ల నిధులతో పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దే పనులు కొనసాగుతున్నాయి. మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, రెండు జిల్లాల కలెక్టర్లు అనుదీప్‌ దురిశెట్టి, జితేష్‌ వి.పాటిల్‌, ఖమ్మం పోలీస్‌ కమిషనర్‌ సునీల్‌దత్‌, కొత్తగూడెం ఎస్పీ రోహిత్‌రాజ్‌, అటవీ శాఖ భద్రాద్రి జోన్‌ సీసీఎఫ్‌ భీమా నాయక్‌, డీఎఫ్‌ఓ సిద్ధార్ధ్‌ విక్రమ్‌సింగ్‌. ఎఫ్‌డీఓ మంజుల తరచూ పర్యవేక్షిస్తుండడంతో పర్యాటకులకు ఒక్కటొక్కటిగా సౌకర్యాలు సమకూరుతూ ఉమ్మడి జిల్లా వాసులకు కొత్త పర్యాటక కేంద్రం అందుబాటులోకి వచ్చినట్లయింది.

మనస్సును ఆహ్లాదపరిచేలా..

పులిగుండాల ప్రాజెక్టు వద్దకు వెళ్తే అన్ని బాధలు, కష్టాలు మరిచిపోవడమే కాక మనస్సు ఆహ్లాదంగా మారుతుంది. మార్గమధ్యలో ఎలుగుబంటి. దుప్పులు, కణుజులు, అడవిపిల్లులు, జంగుపిల్లులు, పూనుగు పిల్లులు, మూషిక జింక, నెమళ్లను చూడొచ్చు. సముద్ర మట్టానికి 700 అడుగుల ఎత్తులో నిర్మించిన లియోపార్డ్‌ టవర్‌ నుంచి చూస్తే అటవీ అందాలతో పాటు చిరుతపులి కదలికలూ అప్పుడప్పుడు కనిపిస్తాయి.

ప్రత్యేక బస్సు.. అడ్వాన్స్‌ బుకింగ్‌

పులిగుండాల ప్రాజెక్టు సందర్శన కోసం ప్రత్యేక బస్సు సౌకర్యం కల్పించారు. ప్రతీ శని, ఆదివారం వి.ఎం.బంజరు బస్టాండ్‌ నుంచి అటవీశాఖ ఏర్పాటు చేసిన బస్సులు ఉదయం 9, 9.30 గంటలకు, కల్లూరు బస్టాండ్‌ నుంచి 11, 11.30 గంటల సమయాన బయలుదేరి రామకృష్ణాపురం వరకు వెళ్తాయి. బ్రహ్మాళ్లకుంట ముఖద్వారం నుంచి అటవీశాఖ ఏర్పాటు చేసిన సఫారి వాహనంలో ప్రయాణిస్తూ అటవీ అందాలను తిలకించవచ్చు. టికెట్‌ ధర పెద్దలకు రూ.20, పిల్లలకు రూ.10గా నిర్ణయించారు. అలాగే, 94412 18466 నంబర్‌ ద్వారా అడ్వాన్స్‌ బుకింగ్‌ సౌకర్యమూ కల్పించారు. సొంత వాహనంలో వచ్చే పర్యాటకులు సఫారీ వాహనంలోనే వెళ్లాల్సి ఉంటుంది.

27 కిలోమీటర్ల ప్రయాణం

పెనుబల్లి మండలం బ్రహ్మాళ్లకుంట ముఖద్వారం నుంచి 27 కిలోమీటర్లు ఘాట్‌రోడ్డులో అటవీశాఖ ఏర్పాటు చేసిన సఫారి వాహనంలో ప్రయాణం అద్భుతంగా సాగుతుంది. అటవీశాఖ అభివృద్ధి చేసిన హ ట్లతో విశ్రాంతి తీసుకునే అవకాశముంది. ఎవరూ ఇబ్బంది పడకుండా టాయిలెట్లు, తాగునీటి సదుపాయం కల్పించారు. మూడు వాచ్‌టవర్లు, సెల్ఫీపాయింట్‌, రాత్రి బసకు నైట్‌ క్యాంపింగ్‌ సైట్‌, సోలార్‌ బోరు ఏర్పాటు చేశారు. డీఆర్‌డీఏ ఆధ్వర్యాన రిసెప్షన్‌హట్‌(భోజనశాల), అటవీ ఉత్పత్తుల విక్రయ స్టాల్‌ కూడా ఉంది. కాగా, చండ్రుగొండ మండలం బెండాలపాడు సమీపాన కనిగిరి గుట్టలపై 11వ శతాబ్ధంలో ప్రతాపరుద్రుడు నిర్మించిన భద్రకాళి సమేత వీరభద్రస్వామి ఆలయం.. అక్కడ మోటబావిని కూడా చూడొచ్చు. అలాగే, పులిగుండాల ప్రాజెక్టు సమీపాన శివాలయంలో పూజలు చేసే అవకాశముంది.

కొత్తదనం సంతరించుకున్న పులిగుండాల

ఆస్వాదిద్దాం1
1/2

ఆస్వాదిద్దాం

ఆస్వాదిద్దాం2
2/2

ఆస్వాదిద్దాం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement