
బాధ్యతాయుతంగా పనిచేయండి
● సీఎం పర్యటన ఏర్పాట్లలో లోపాలుంటే సహించం ● అధికారులకు కలెక్టర్ పాటిల్ హెచ్చరిక
చండ్రుగొండ : ఈ నెల 21న ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పర్యటన నేపథ్యంలో సదుపాయాల కల్పనలో ఎలాంటి లోపాలున్నా సహించబోమని కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. చండ్రుగొండ మండలం బెండాలపాడులో శనివారం ఆయన జిల్లా అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. సీఎం పర్యటన పూర్తయ్యే వరకు అన్ని శాఖల అధికారులు ఇక్కడే పని చేయాలని, బాధ్యతగా వ్యవహరించాలని సూచించారు. ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులతో పాటు పరిమిత సంఖ్యలోనే ఇతరులను గ్రామంలోకి అనుమతిస్తామని చెప్పారు. ఇందిరమ్మ ఇళ్లలో లబ్ధిదారుల గృహప్రవేశాల అనంతరం సీఎం రేవంత్‌రెడ్డి వారికి దుస్తులు పంపిణీ చేస్తారని తెలిపారు. అనంతరం సీఎం ప్రారంభించనున్న ఇందిరమ్మ ఇళ్లను పరిశీలించారు.
హెలీప్యాడ్, సభాస్థలి సందర్శన..
చండ్రుగొండలో ఏర్పాటు చేస్తున్న హెలీప్యాడ్, బహిరంగ సభ స్థలాలను ఎమ్మెల్యే జారే ఆదినారాయణ, కలెక్టర్ జితేష్ వి. పాటిల్, ఎస్పీ రోహిత్‌రాజ్ పరిశీలించారు. వర్షం వస్తే ముందస్తుగా తీసుకోవాల్సిన జాగ్రత్తలతో పాటు సీఎం కాన్వాయ్, ఇతర వాహనాల పార్కింగ్ తదితర అంశాలపై చర్చించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ వేణుగోపాల్, జెడ్పీ సీఈఓ నాగలక్ష్మి, డీఎంహెచ్‌ఓ జయలక్ష్మి, హౌసింగ్ పీడీ రవీంద్రనాథ్, డీఎస్పీ అబ్దుల్ రహెమాన్, సీఐ విజయలక్ష్మి, ప్రత్యేకాధికారి సంజీవరావు తదితరులు పాల్గొన్నారు.
రేపటి ప్రజావాణి రద్దు..
సీఎం రేవంత్‌రెడ్డి జిల్లా పర్యటన నేపథ్యంలో సోమవారం కలెక్టరేట్‌లో నిర్వహించే ప్రజావాణి కార్యక్రమాన్ని రద్దు చేస్తున్నట్లు కలెక్టర్ వెల్లడించారు. ఈ విషయాన్ని ప్రజలు గమనించి వినతులు ఇచ్చేందుకు రావొద్దని కోరారు.
జిల్లాకు రెడ్ అలర్ట్...
కొత్తగూడెం అర్బన్ : జిల్లాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని, వాతావరణ శాఖ జిల్లాను రెడ్ అలర్ట్‌గా ప్రకటించిందని కలెక్టర్ జితేష్ వి పాటిల్ తెలిపారు. ఈ మేరకు శనివారం ఒక ప్రకటన విడుదల చేశారు. అధికారులు, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. భారీ వర్ష సూచన నేపథ్యంలో జిల్లాలోని అధికారులు అప్రమత్తంగా ఉంటూ ప్రజలకు ఎప్పటికప్పుడు సమాచారం అందించాలని ఆదేశించారు. సాయంత్రం వేళలో వాగులు, పొలాల వద్దకు వెళ్లొద్దని కోరారు. ప్రమాదాల సమయంలో సాయం అవసరమైతే ఇప్పటికే ఏర్పాటు చేసిన కంట్రోల్ రూమ్‌లను సంప్రదించాలని పేర్కొన్నారు. కలెక్టరేట్‌లో ఏర్పాటు చేసిన 08744 – 241950, వాట్సాప్ నంబర్ 93929 19743, భద్రాచలం సబ్ కలెక్టరేట్‌లో ఏర్పాటు చేసిన 08743 – 232444, వాటాప్ నంబర్ 93479 10737, ఐటీడీఏ కార్యాలయంలోని 79952 68352 నంబర్లలో సంప్రదించాలని సూచించారు.