
జోరువానలో మూడుగంటలు శ్రమించి..
బూర్గంపాడు: మండల కేంద్రంలోని బాలికల గురుకుల పాఠశాల, జూనియర్ కళాశాలలో శుక్రవారం రాత్రి 63 కేవీ విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్ ఫెయిలై సరఫ రా నిలిచిపోయింది. దీంతో హాస్టల్, తరగతి గదుల్లో అంధకారం అలుముకుంది. ఓ పక్క జోరువాన.. మరోవైపు చిమ్మచీకటిలో దోమల దండయాత్ర సాగించాయి. సుమారు 400 మందికి పైగా బాలికలకు తీవ్ర ఇబ్బందులు పడుతుండగా గురుకుల పాఠశాల ఉపాధ్యాయులు తమ పరిస్థితిని విద్యుత్ శాఖ అధికారులకు సమాచారం అందించారు. దీంతో జోరువానను సైతం లెక్కచేయకుండా విద్యుత్ శాఖ అధికారులు స్పందించి కాంట్రాక్టర్లు సతీష్, కేదారేశ్వరరెడ్డి సహకారంతో 25 కేవీ విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్‌ను ట్రాక్టర్‌లో తెప్పించారు. అయితే పాఠశాల ఆవరణ మొత్తం వర్షానికి బురదమయంగా మారడంతో ట్రాక్టర్ దిగబడిపోయింది. మరో ట్రాక్టర్‌ను తెప్పించి మూడు గంటల పాటు శ్రమించి ఎట్టకేలకు ట్రాన్స్‌ఫార్మర్‌ను ఏర్పాటు చేసి విద్యుత్ సరఫరాను పునరుద్ధరించారు. దీంతో గురుకుల పాఠశాల విద్యార్థులు, ఉపాధ్యాయులు ఊపిరి పీల్చుకున్నారు. కొత్త ట్రాన్స్‌ఫార్మర్ ఏర్పాటులో బూర్గంపాడు విద్యుత్ శాఖ లైన్ ఇన్‌స్పెక్టర్ కనుకు సత్యనారాయణ, రామకృష్ణ, లైన్‌మెన్‌లు జిలాని, భాస్కర్, ప్రదీప్, వెంకన్న, ప్రసాద్ ఎంతగానో శ్రమించారు.
బాలికల గురుకులానికి విద్యుత్ సరఫరా పునరుద్ధరణ