
అవసరం తీరాక అంతే..
వందేళ్ల సేవకు ఇదేనా గుర్తింపు?
వారసులను విస్మరించొద్దు
● నాడు ఆశ్రయం కల్పించి.. పనిచేయించారు.. ● నేడు లీజ్ భూముల పేరుతో ఖాళీకి ప్రణాళిక ● కార్మిక కుటుంబాలపై సింగరేణి శీతకన్ను
ఇల్లెందురూరల్: బొగ్గు గనుల్లో పనులు చేసేందుకు ఆవిర్భావ సమయంలో స్థానిక కూలీలు ముందుకు రాలేదు. నాటి అధికారులు సుదూర ప్రాంతాల నుంచి కార్మికులను రప్పించి ఆశ్రయం కల్పించి పూసపల్లి భూగర్భగనిలో పనులు చేయించారు. నాడు వలస కార్మికుల సమూహంతో గూడుకట్టుకున్న ఆవాసం నేడు 21పిట్ ఏరియాగా ఉంది. ఆవిర్భావం నాటి కార్మికుల వారసులే ప్రస్తుతం ఇక్కడ జీవనం సాగిస్తున్నారు. కానీ, 138 ఏళ్ల తర్వాత ఓసీ విస్తరణ పనుల పేరుతో నిర్వాసితులను ఇక్కడి నుంచి ఖాళీ చేయించేందుకు సింగరేణి అధికారులు సిద్ధమవుతుండడం వారిలో ఆందోళన కలిగిస్తోంది.
అంకితభావంతో పనులు
బొగ్గు తవ్వకాలు జరుగుతున్న సమయంలో ఇతర ప్రాంతాల నుంచి కార్మికులను రప్పించి పనిలో వినియోగించారు. ఆ రోజుల్లో బొగ్గు తవ్వే పని చాలా ప్రమాదకరంగా ఉండేది. కార్మికుడు బావిలో పనికి వెళ్తే తిరిగి వచ్చే వరకు ఆ కుటుంబం బిక్కుబిక్కుమంటూ గడపాల్సిన పరిస్థితి ఉండేది. తగినంత గాలి, వెలుతురు లేకపోవడంతో కూడా వారి ఆరోగ్యానికి హాని కలిగేది. రోజుకు 10 – 12 గంటలు పని చేసినా వారికి దినసరి కూలీ చెల్లించేవారు. అయినా వారు కష్టపడి పనిచేశారు.
గని సమీపంలోనే గుడిసెలు
బొగ్గు గనుల ఆవిర్భావ సమయంలో నాటి అధికారుల ఆదేశం మేరకు కార్మికులు గనికి సమీపంలోనే గుడిసెలు వేసుకొని నివసించేవారు. గుడిసె నిర్మాణం కోసం సంస్థ అధికారులే సామగ్రి సమకూర్చేవారు. చుట్టూ దట్టమైన అడవి ఉండటంతో క్రూరమృగాల భయంతో పని ముగిసిన తరువాత కార్మికులు సమూహంగా ఏర్పడి దివిటీ వెలుగులో గూటికి చేరుకునేవారు. సింగరేణి నామకరణంతో పబ్లిక్ లిమిటెడ్ సంస్థగా గుర్తింపు పొందిన తరువాత కార్మికుల నివాసాలకు సమీపంలోనే అధికారుల నివాసం కోసం రేకులతో క్వార్టర్లను నిర్మించారు. అప్పటి నుంచి 21పిట్ ఏరియాగా పిలుస్తుంటారు.
స్పష్టమైన హామీలతో చకచకా..
వందేళ్లకు పైగా బొగ్గు తవ్వకాలు చేపట్టిన ఇల్లెందు ప్రాంతంలో బొగ్గు నిక్షేపాలు అడుగంటడంతో ప్రస్తుతం జేకేఓసీ విస్తరణ పేరుతో సింగరేణి యాజమాన్యం బొగ్గు వెలికితీతకు సన్నద్దమైంది. దీనికోసం అన్ని అనుమతులు పొందే సమయంలోనే ప్రజాభిప్రాయ సేకరణ పేరుతో సభ నిర్వహించింది. నిర్వాసితులయ్యే వారికి మెరుగైన ప్యాకేజీ ఇస్తామని, ప్రజలందరికీ న్యాయం చేస్తామని యాజమాన్యం ప్రకటించింది. నిర్వాసితుల గుర్తింపులోనూ అలాగే ప్రకటనలు గుప్పించి, ముందుకెళ్లారు.
బూడిద చేతిలో పెట్టి..
21పిట్ ప్రాంతం మొత్తం సింగరేణి లీజు పరిధిలో ఉందని, ఇక్కడ నివసిస్తున్న వారికి పరిహారం ఇవ్వడం కుదరదని, ఇల్లు కట్టుకునేందుకు 90 గజాలు స్థలం మాత్రమే ఇస్తామని సింగరేణి అధికారులు స్పష్టం చేస్తున్నారు. పరిహారం మాటెత్తొద్దని హుకుం జారీ చేస్తున్నారు. కానీ, బ్రిటీష్ హయాంలో 21పిట్ ఏరియాకు వలసవచ్చిన కార్మికులు అంకితభావంతో పనులు చేసి సంస్థను నిలబెట్టారు. మానవతా దృక్పథంతో సాయం చేయాల్సిన అధికారులు చట్టాలను చూపించడం ఏంటనే ప్రశ్న ఉత్పన్నమవుతోంది. కాగా, ఓ అధికారి.. ‘మీరు నివసిస్తున్న ఇంటి స్థలం ఎవరిదో మీ అయ్యలు మీకు చెప్పలేదా’అంటూ వ్యంగ్యంగా మాట్లాడటం ఆగ్రహానికి కారణమవుతోంది.
మా నాన్న ఇబ్రహీం బేగ్ వందేళ్ల కిందట సింగరేణిలో పని చేశాడు. నాటి నుంచి మా కుటుంబం ఇక్కడే ఉంటోది. నేడు ఇంటి స్థలం ఇస్తాం.. ఖాళీ చేయండి అంటున్నారు. ఎక్కడికి వెళ్లాలో తెలియడం లేదు. వందేళ్ల సేవను పరిగణనలోకి తీసుకోకపోవడం సరికాదు.
–ఎండీ బేగ్, 21పిట్ ఏరియా
సింగరేణి సంస్థకు పురుడు పోసిన కార్మికుల శ్రమను సంస్థ గౌరవించాలి. వారి వారసులకు అందించే సహకారాన్ని, ఇచ్చే పరిహారాన్ని మానవీయ కోణంలో చూడాలి. నాడు అవసరం కోసం ఇంటి నిర్మాణానికి సహకరించి ఇప్పుడు ఖాళీ చేయమనడం అన్యాయం.
–దండు బాలయ్య, మాజీ కార్మికుడు

అవసరం తీరాక అంతే..

అవసరం తీరాక అంతే..