
అంతర్రాష్ట్ర ముఠా సంచారం..!
కరకగూడెం/పినపాక: రిజర్వ్ ఫారెస్ట్ ఏరియా లో ఉన్న తునికి చెట్లను అక్రమంగా నరికి ఇతర రాష్ట్రాలకు తరలించే అంతర్రాష్ట్ర ముఠా పినపాక, కరకగూడెం, మణుగూరు మండలాల్లో సంచరిస్తున్నట్లు విశ్వసనీయ సమాచా రం అందిందని ఏడూళ్ల బయ్యారం రేంజర్ తేజస్విని తెలిపారు. శుక్రవారం పలు గ్రా మాల్లో ప్రజలకు అవగాహన కల్పించారు. తునికి చెట్లు అటవీ సంపదలో భాగమని, వీటిని నరికితే పర్యావరణానికి నష్టం వాటిల్లుతుందని పేర్కొన్నారు. అంతరాష్ట్ర దొంగలు కొందరు కరకగూడెం, మణుగూరు, పినపాక మండలాల్లో పాగా వేసి చెట్లను నరికేందుకు సిద్ధమయ్యారని, గ్రామస్తులు అప్రమత్తంగా ఉండి గుర్తు తెలియని వ్యక్తులు సంచరిస్తే ఫారెస్ట్ అధికారులకు తెలపాలని ఆమె సూచించారు.
విద్యార్థులకు
అటెండర్ చేయూత
అశ్వాపురం: మండలంలోని నెల్లిపాక బంజర జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో చదువుకుంటున్న దూరప్రాంత విద్యార్థుల రవాణా ఖర్చులకు పాఠశాలలో అటెండర్‌గా పనిచేస్తున్న జ్యోతికిరణ్ తన జీతం నుంచి ప్రతి నెల రూ.6 వేలు ఇస్తానని శుక్రవారం స్వాతంత్య్ర దినోత్సవంలో ప్రకటించారు. దూరప్రాంతాల నుంచి పాఠశాలకు వస్తున్న విద్యార్థులకు రెండేళ్లుగా గ్రామస్తులు తలా కొంత డబ్బు సాయం చేస్తున్నారు. ఈ ఏడాది దాతలు ముందుకు రాకపోవడంతో అటెండర్ జ్యోతికిరణ్ విద్యార్థులకు సహాయం చేయడానికి ముందుకు రాగా.. గ్రామస్తులు హర్షం వ్యక్తం చేశారు. జ్యోతికిరణ్‌ను పాఠశాల హెచ్‌ఎం శంకర్ ఆధ్వర్యంలో సన్మానించారు. కాగా, హిందీ ఉపాధ్యాయుడు రాంబాబు ఒక నెలకు విద్యార్థుల రవాణా ఖర్చుకు రూ.10 వేలు, నెల్లిపాక పంచాయతీ మాజీ ఉపసర్పంచ్ అక్కిన అచ్చుతరామారావు రూ.10 వేలు అందించారు.
సూర్యతండాలో
చిన్నారులకు అస్వస్థత
రఘునాథపాలెం: రఘునాథపాలెం మండలంలోని సూర్యతండాలో పది రోజులుగా పలువురు చిన్నారులు అస్వస్థతకు గురవుతున్నారు. ఉన్నట్టుండి వరుసగా వాంతులు, విరోచనాల బారిన పడుతుండడంతో తల్లిదండ్రులు చికిత్స చేయిస్తున్నారు. ఒకే కుటుంబానికి చెందిన అన్నాచెల్లెలు జాటోత్ జయంత్, పవన్‌శ్రీ ప్రభుత్వ ఆస్పత్రిలో వైద్యం పొందుతున్నారు. కాగా, గ్రామంలో పలువురు చిన్నారులు అస్వస్థతకు గురవడానికి తాగునీరు కలుషితమా లేక వాతావరణ మార్పులు కారణమా అన్నది తెలియడం లేదు. వైద్యాధికారులు స్పందించి తగుచర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.

అంతర్రాష్ట్ర ముఠా సంచారం..!