
ఉట్ల సందడికి వేళాయె..
అశ్వారావుపేటరూరల్: శ్రీకృష్ణుని జన్మదినాన్ని పురస్కరించుకుని ప్రజలు ఎంతో ఉల్లాసంగా జరుపుకునే ఉట్ల పండుగ రానే వచ్చింది. శ్రావణ మాసం కృష్ణపక్ష అష్టమి రోజున శ్రీకృష్ణుడు జన్మించాడని పురణాలు చెబుతుండగా, ఏటా శ్రీకృష్ణ జన్మాష్టమిని జరుపుకుంటారు. భక్తులు శనివారం పండగను జరుపుకునేందుకు సన్నద్ధమయ్యారు. బాల కృష్ణుడిని పూజిస్తే సకల శుభాలతోపాటు సంతానప్రాప్తి కలుగుతుందని పలువురు విశ్వసిస్తారు. ఇందుకు పగలంతా ఉపవాసం ఉండి సాయంత్రం శ్రీకృష్ణున్ని పూజిస్తారు. శ్రావణ మాసంలో లభించే పళ్లు, అటుకులు, బెల్లం కలిపిన వెన్న, పెరుగు, మీగడ స్వామికి నైవేద్యంగా పెడతారు. ఊయలలో శ్రీకృష్ణ విగ్రహాన్ని పడుకోబెట్టి ఊపుతూ రకరకాల పాటలు, కీర్తనలు పాడుతూ స్మరిస్తారు. వీధుల్లో, కూడళ్లలో ఉట్లు కట్టి పోటీపడి వాటిని కొడతారు. శ్రీకృష్ణుడి జన్మాష్టమి వేడుకలను ప్రజలు అంగరంగ వైభవంగా జరుపుకుంటారు. చిన్నారులను కృష్ణుడు, గోపికల వేషధారణలతో అలంకరిస్తారు. ఉట్టికొట్టే కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహిస్తారు. కాగా, ప్లిలలను కృష్ణుని, గోపికల రూపాలలో అలకరించేందుకు తల్లిదండ్రులు ఆసక్తి కనబరుస్తుండడంతో మార్కెట్లలో ఆయా డ్రస్సులు, పిల్లన గ్రోవులు, నెమలి పింఛాల విక్రయాలు జోరుగా సాగుతున్నాయి.
నేటి శ్రీకృష్ణాష్టమి పండుగకు సన్నద్ధం