
మర్రిగూడెంలో మద్యనిషేధం
ఐక్యంగా ఉంటాం
సమష్టి నిర్ణయంతో
ఇల్లెందురూరల్: మండలంలోని మర్రిగూడెం పంచాయతీలో 36 ఏళ్లుగా సంపూర్ణ మద్య నిషేధం అమలవుతోంది. పంచాయతీ పరిధిలో ఆరు గ్రామాలు ఎల్లాపురం, మర్రిగూడెం, రాళ్లగుంపు, రామకృష్ణాపురం, కోటన్న నగర్, ఏడిప్పలగూడెం ఉన్నాయి. పంచాయతీలో 95 శాతం ఆదివాసీలు నివసిస్తున్నారు. 1980 ప్రాంతంలో ప్రజలంతా మద్యం, గుడుంబాకు బానిసలుగా మారి ఇల్లు, ఒల్లు గుల్ల చేసుకున్నారు. ఇంటి వద్దే బట్టీలు పెట్టి గుడుంబా తాగడమే పనిగా పెట్టుకోవడంతో అక్కడి మహిళల్లో కదలిక తెచ్చింది. ఆ రోజుల్లో న్యూడెమోక్రసీ నేత మూతి రామక్క గ్రామాల్లో సమావేశాలు నిర్వహించి మహిళల్లో చైతన్యం కలిగించారు. గ్రామ పెద్దలు సైతం ముందుకొచ్చి మహిళా ఉద్యమానికి మద్దతుగా నిలిచారు. సమావేశం ఏర్పాటు చేసుకుని సంపూర్ణ మద్య నిషేధం ప్రకటించారు. అప్పటి నుంచి మద్యనిషేధం కొనసాగుతోంది.
పంచాయతీ మూడుసార్లు ఏకగ్రీవం..
తొలుత గ్రామాలను గండికింద ప్రాంతాలుగా పిలిచేవారు. పోలారం గ్రామపంచాయతీలో మిళితమై ఉండేవి. 2002లో ఆరు గ్రామాలను కలిపి మర్రిగూడెం గ్రామపంచాయతీగా ఏర్పాటు చేశారు. ఇప్పటివరకు నాలుగుసార్లు ఎన్నికలు జరగ్గా, మూడుసార్లు ఏకగ్రీవమైంది. 2019లో మాత్రమే ఎన్నికలు జరిగాయి. ఆ సమయంలోనూ గ్రామపెద్దల నిర్ణయం మేరకే ప్రజలంతా ఒక్కటై నూతన సర్పంచ్‌ను ఎన్నుకున్నారు.
36 ఏళ్లుగా అమలు చేస్తున్న
పంచాయతీ ప్రజలు
సమస్య ఏదైనా గ్రామంలో అందరం ఒక్కటై ముందుకు సాగుతాం. ఈ సంప్రదాయమే మా పంచాయతీని ఆదర్శంగా నిలిపింది. మద్యం, గుడుంబా ఎవరు విక్రయించినా తగిన చర్యలు తీసుకుంటాం.
– చింత రజిత, మర్రిగూడెం
ఇప్పటివరకు మూడుసార్లు ఏకగ్రీవంగా సర్పంచ్‌ను ఎన్నుకున్నాం. 2019లో పోటీ నెలకొన్నా సమష్టి నిర్ణయంతోనే అభ్యర్థిని గెలిపించుకున్నాం. పంచాయతీని ఆదర్శంగా నిలుపుకున్నాం. ఇక ముందు కూడా అలాగే చేస్తాం.
– ఇర్ప తిరుపతమ్మ, మర్రిగూడెం

మర్రిగూడెంలో మద్యనిషేధం

మర్రిగూడెంలో మద్యనిషేధం