
మోదీ విధానాలతో రైతులకు నష్టం
అశ్వారావుపేట: మోదీ ట్రంప్‌తో అనుసరిస్తున్న విధానాల వల్ల దేశ రైతాంగానికి తీవ్ర నష్టం వాటిల్లే ప్రమాదం ఉందని సీపీఎం కేంద్ర కమిటీ సభ్యుడు తమ్మినేని వీరభద్రం అన్నారు. గురువారం మండల పరిధిలోని నందిపాడు గ్రామంలో సీపీఎం సీనియర్ నాయకుడు, మాజీ సర్పంచ్ ఊకే వీరాస్వామి సంస్మరణ సభకు హాజరై నివాళులర్పించారు. అనంతరం అశ్వారావుపేట సీపీఎం కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. మోదీ, ట్రంప్ స్నేహితులని చెబుతూనే భారత్‌పై అమెరికా పెత్తనం ఏంటని ప్రశ్నించారు. అమెరికా వ్యవసాయ ఉత్పత్తులను మనదేశంలో విక్రయించేందుకు ఎత్తుగడ వేస్తున్నారని ఆరోపించారు. ఎన్నికల కమిషన్ సహకారంతో బీజేపీ భారీగా ఓట్ల చోరీకి పాల్పడుతోందని ఆరోపించారు. సీపీఎం నాయకులు పోతినేని సుదర్శన్, కొక్కెరపాటి పుల్లయ్య, బుడితి చిరంజీవి నాయుడు, మడిపల్లి వెంకటేశ్వరరావు, సోయం ప్రసాద్ పాల్గొన్నారు.
సీపీఎం కేంద్ర కమిటీ సభ్యుడు
తమ్మినేని వీరభద్రం