● పుట్టుకతోనే కొందరు ఎడమ చేతివాటం ● అలాంటివారే ప్రతిభావంతులంటున్న నిపుణులు
నేడు వరల్డ్ లె ఫ్ట్ హ్యాండర్స్ డే
పాల్వంచరూరల్: కొందరు వ్యక్తుల్లోని భిన్నత్వం వారిని ప్రత్యేకంగా ఉండేలా చేస్తుంది. సాధారణంగా ప్రతీ వ్యక్తిలో భిన్నమైన లక్షణాలు ఉంటే వెంటనే గుర్తించవచ్చు. ప్రతీ వంద మందిలో 95 శాతం మంది కుడి చేతివాటం వారు ఉండగా మిగతా 5 శాతం మంది లెఫ్ట్ హ్యాండర్స్ కనిపిస్తుంటారు. ఎడమ చేతివాటం అనేది జన్యుప్రభావ ఫలితంగా కలుగుతుందని పరిశోధనల్లో తేలింది. నేడు ప్రపంచ లెఫ్ట్ హ్యాండర్స్ డే సందర్భంగా కథనం.
జన్యు ప్రభావం..
ప్రతీ వ్యక్తి పుట్టినప్పటి నుంచే కుడి, ఎడమ చేతి వాటాలను సహజ సిద్ధంగా కలిగి ఉంటారని నిపుణులు చెబుతున్నారు. ఒక వ్యక్తికి మెదడు కుడి, ఎడమ రెండు అర్ధభాగాలుగా ఉంటుంది. కుడి వైపు శరీర భాగాన్ని మెదడు ఎడమ అర్ధభాగం నియంత్రిస్తుందని, కుడి అర్ధభాగం మెదడు బలంగా ఉన్న వారిలో ఎడమ చేతివాటం వస్తుందని చెబుతున్నారు. చిన్నప్పటి నుంచే తల్లిదండ్రులు ఎడమ చేతివాటాన్ని గమనిస్తే మాన్పించొద్దని సూచిస్తున్నారు.
భిన్నమైన శైలి..
కుడి చేతివాటం వారి కంటే ఎడమ చేతివాటం వారిలో ప్రత్యేక తెలివితేటలుంటాయని, మేధోశక్తి, ఆలోచన, తెలివి భిన్నంగా ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. ప్రపంచంలో గుర్తింపు పొందిన మేధావుల్లో చాలామంది ఎడమ చేతివాటం వారేనని సమాచారం. ప్రముఖ సినీనటుడు అమితాబ్ బచ్చన్, ప్రఖ్యాత క్రికెటర్లు సౌరవ్ గంగూలి, యువరాజ్ సింగ్ వంటి వారు కూడా ఎడమ చేతివాటం వారే కావడం విశేషం. కాగా, ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్మీడియట్ విద్యార్థులు 8 మంది, దమ్మపేట సాంఘిక సంక్షేమ బాలుర గురుకుల పాఠశాలలో ఏడుగురు ఎడమ చేతివాటం కలిగి ఉన్నారు.
పనులను మాన్పించొద్దు..
ఎడాదిన్నర నుంచి రెండేళ్ల వయస్సు నుంచి వస్తువులను పట్టుకోవడం ప్రారంభిస్తారు.అప్పుడే కుడి, ఎడమలను గుర్తించవచ్చు. పిల్లలు ఎడమ చేతివాటం పనులు చేస్తుంటే తల్లిదండ్రులు మాన్పించే ప్రయత్నం చేయొద్దని, అలా చేస్తే సమస్యలు తలెత్తుతాయని నిపుణులంటున్నారు. కుడి చెయ్యితే రోజు వారి పనులు చేయడం సహజం. అయితే, ఆ పనులన్నీ ఎడమ చేతితో చేయడం కాస్త ఇబ్బందిగా మారుతుంది. రోజువారి పనులు ఎడమ చేత్తో చేస్తూ ప్రత్యేకంగా గుర్తింపు పొందిన వారు చాలామంది ఉన్నారని పరిశోధకులు పేర్కొంటున్నారు.
వామ హస్తం.. వరమే!