
ఆలయంలో చోరీ
పాల్వంచరూరల్: మండల పరిధి యానంబైల్‌లోని శ్రీసీతారామాంజనేయ స్వామి ఆలయంలో గుర్తుతెలియని దుండగులు చోరీకి పాల్పడ్డారు. పోలీసుల కథనం ప్రకారం.. శ్రీసీతారామాంజనేయ స్వామి ఆలయంలో ఈ నెల 11వ తేదీ రాత్రి గుర్తుతెలియని దుండగులు గుడి తాళాన్ని పగలగొట్టి, హుండీని ధ్వంసం చేసి, భక్తుల కానుకలను చోరీ చేశారు. ఆలయ కమిటీ బాధ్యులు శిరసాని వినోద్‌కుమార్ ఫిర్యాదు మేరకు ఎస్‌ఐ సురేశ్ కేసు నమోదు చేశారు.
ఇసుక ట్రాక్టర్ సీజ్
ములకలపల్లి: అక్రమంగా ఇసుక తరలిస్తున్న ట్రాక్టర్‌ను పోలీసులు సీజ్ చేశారు. ఎస్‌ఐ కిన్నెర రాజశేఖర్ కథనం మేరకు.. మండలంలోని రామాంజనేయపురంలోని వాగు నుంచి ఇసుక తరలిస్తున్నట్లు మంగళవారం సమాచారం అందింది. దాడి చేసి, అనుమతి పత్రాలు లేకుండా ఇసుక తోలుతున్న ట్రాక్టర్‌ను అదుపులోకి తీసుకొని పోలీస్ స్టేషన్‌కు తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.
విద్యుత్ షార్ట్ సర్క్యూట్‌తో పూరిల్లు దగ్ధం
అశ్వారావుపేటరూరల్: విద్యుత్ షార్ట్ సర్క్యూట్‌తో పూరిల్లు దగ్ధమైన ఘటన మండలంలో మంగళవారం రాత్రి చోటుచేసుకుంది. గ్రామస్తుల కథనం ప్రకారం.. మండలంలోని గాండ్లగూడేనికి చెందిన ధరావత్ బాలాజీకి చెందిన పూరింట్లో స్విచ్ బోర్డు వద్ద మంటలు వ్యాపించి అంటుకున్నాయి. బాలాజీ కూలీ పనులకు వెళ్లగా, ఇంట్లో భార్య చంద్రావతి, కుమార్తె గమనించి భయందోళనకు గురై బయటకు పరుగులు తీశారు. చుట్టు పక్కల వారంతా చేరుకొని మంటలను ఆర్పేందుకు యత్నించగా ఇళ్లంతా కాలి బూడిదైంది. కాగా, ఇంట్లో గ్యాస్ బండ పేలిపోవడంతో గ్రామస్తులు ఆందోళన చెందారు. బీరువాలో భద్రపరిచిన రూ.1.50 లక్షలు, నగదుతోపాటు సామగ్రి అంతా కాలిపోగా, సుమారు రూ.3 లక్షల ఆస్తినష్టం జరిగినట్లు అంచనా. సమాచారం అందుకున్న అశ్వారావుపేట ఫైర్ ఇంజన్ ఘటనా స్థలానికి చేరుకోగా.. అప్పటికే అంతా కాలి బూడిదైంది. అగ్ని మాపక శాఖ అధికారులు వివరాలు సేకరిస్తున్నారు.
గంజాయి రవాణా కేసులో
ఇద్దరికి 20 ఏళ్ల జైలుశిక్ష
ఖమ్మంలీగల్: గంజాయి తరలిస్తూ పట్టుబడిన ఇద్దరికి 20ఏళ్ల చొప్పున కఠిన కారాగార శిక్షతో పాటు రూ.2 లక్షల చొప్పున జరిమానా విధిస్తూ ఖమ్మం మొదటి అదనపు జిల్లా సెషన్స్ కోర్టు న్యాయమూర్తి కె.ఉమాదేవి మంగళవారం తీర్పు వెలువరించారు. మేడ్చల్ మల్కాజ్‌గిరి జిల్లా దిండిగల్ గండిమైసమ్మ ప్రాంతానికి చెందిన నాయక్ మల్లేష్, గడ్డం భువన్ అలియాస్ ఎరుగుంట్ల రవితేజతో పాటు ఇషాక్ జల్సాలకు అలవాటు పడి అక్రమార్జన కోసం గంజాయి రవాణా చేస్తున్నారు. ఈక్రమంలోనే 2021 ఏప్రిల్ 28న కారులో రూ.30 లక్షల విలువైన 200 కేజీల గంజాయితో వస్తుండగా, ఖమ్మం సమీపాన వి.వెంకటాయపాలెం వద్ద పోలీస్ చెక్‌పోస్ట్ ఉండడంతో వేగం పెంచారు. ఈక్రమంలో ప్రయాణికులతో ఉన్న ఆటోను ఢీకొట్టగా రెండు వాహనాలు బోల్తా పడ్డాయి. ఆటోలో వెళ్తున్న ఒకరు మృతి చెందగా పోలీసులు చేరుకుని కారులో పరిశీలించడంతో 200 కేజీల గంజాయి లభించింది. ఈమేరకు మల్లేష్, భువన్ పట్టుబడగా ఇషాక్ పారిపోయాడు. వీరిపై రఘునాథపాలెం పోలీసులు కేసు నమోదు చేసి కోర్టులో చార్జీషీట్ దాఖలు చేఠశారు. విచారణ అనంతరం నిందితులపై నేరం రుజువు కావటంతో ఇద్దరికి 20 ఏళ్ల చొప్పున కఠిన కారాగార శిక్ష, జరిమానా విధిస్తూ న్యాయమూర్తి తీర్పు చెప్పారు. కేసు విచారణ గత, ప్రస్తుత ఇన్‌స్పెక్టర్లు సత్యనారాయణరెడ్డి, ఉస్మాన్ షరీఫ్ చేయగా, అడిషనల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్లు ఏ.శంకర్, జె.శరత్‌కుమార్‌రెడ్డి, ఎస్సై శ్రీనివాస్, సిబ్బంది జి.రవికిషోర్, సాంబశివరావు, కె.శ్రీకాంత్, ఎం.డీ.అయూబ్ సహకరించారు.