
డబుల్‌పై ధ్యాసేది?
సగం కూడా పూర్తి కాలే..
తెలంగాణ వచ్చిన వెంటనే అప్పటి ప్రభుత్వం పేదల సొంతిటి కల నెరవేర్చే లక్ష్యంతో డబుల్ బెడ్‌రూం ఇళ్ల పథకాన్ని ప్రారంభించింది. స్థలంతో సహా ప్రతీ పని తామే చేసి, ఇల్లు పూర్తయ్యాక లబ్ధిదారుడికి అందిస్తామంటూ గొప్పగా ప్రచారం చేసుకుంది. అయితే అమలు విషయంలో ఒకడుగు ముందుకు.. పదడుగులు వెనక్కు.. అన్నట్టుగా పరిస్థితి మారింది. పదేళ్ల బీఆర్‌ఎస్ పాలన ముగిసే నాటికి జిల్లాలో డబుల్ బెడ్ రూం ఇళ్ల నిర్మాణం సగం కూడా పూర్తి కాలేదు. జిల్లాకు 6,168 ఇళ్లు మంజూరు కాగా, 2,973 ఇళ్ల నిర్మాణాలు పూర్తి చేసి, 2,759 మంది లబ్ధిదారులకు పంపిణీ చేశారు. 214 ఇళ్లు పనులు పూర్తయి లబ్ధిదారుల చేతుల్లోకి వెళ్లకుండా పడావుపడి ఉన్నాయి. ఇంకా వివిధ దశల్లో పనులు ఆగిపోయిన ఇళ్లు 3,195 ఉన్నాయి.
అమలుకు నోచని మంత్రి ఆదేశాలు..
జూలై 27న కొత్తగూడెం ఐడీఓసీలో నిర్వహించిన ఉమ్మడి ఖమ్మం జిల్లా అభివృద్ధి, సంక్షేమ పథకాల సమీక్ష సమావేశంలో రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్ శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ.. గతంలో నిర్మించిన, మధ్యలో ఆగిపోయిన డబుల్‌బెడ్‌రూం ఇళ్ల వివరాలను గ్రామాల వారీగా సేకరించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. 2 బీహెచ్‌కే ఇళ్లను ఆగస్టు 15లోగా పంపిణీ చేసేందుకు తగిన చర్యలు తీసుకోవాలన్నారు. అన్నట్టుగానే ఆయన ఇన్‌చార్జ్‌గా ఉన్న వరంగల్ జిల్లాలో ఈనెల 8న నిర్మాణం పూర్తయి ఖాళీగా ఉన్న 592 ఇళ్లను లబ్ధిదారులకు అందించారు. 2015 జనవరిలో అప్పటి సీఎం కేసీఆర్ శంకుస్థాపన చేసిన ఈ ఇళ్లు 2016 నాటికి పూర్తయ్యాయి. అప్పటి నుంచి దాదాపు తొమ్మిదేళ్ల పాటు జీ ప్లస్ 3 నిర్మాణంతో కూడిన అపార్ట్‌మెంట్లు ఖాళీగా ఉండగా.. మంత్రి పొంగులేటి చొరవతో ఈ ఇళ్లు లబ్ధిదారుల వశం అయ్యాయి. దీంతో ఇంత కాలం అద్దె ఇళ్లలో ఉంటూ ఇబ్బంది పడిన వారికి సొంతింటి కల సాకారమైంది.
పట్టణ ప్రాంతాల్లో పడావుగా..
జిల్లాలో ‘డబుల్’ పథకానికి సంబంధించి ఇంటి నిర్మాణం పూర్తయి లబ్ధిదారులు గృహ ప్రవేశం చేసిన వాటిల్లో సింహభాగం గ్రామీణ ప్రాంతాల్లోనే ఉన్నాయి. పట్టణ ప్రాంతాల్లో ఈ పథకంతో ప్రయోజనం పొందిన వారిని వేళ్లపై లెక్కించవచ్చు. జిల్లా కేంద్రంలో పరిశీలిస్తే.. కొత్తగూడెంలో 831 ఇళ్లు మంజూరయ్యాయి. వీటి కోసం పాత కొత్తగూడెంలో దాదాపు 40 ఎకరాలకు పైగా స్థలంలో భారీ స్థాయిలో నిర్మాణాలు చేపట్టారు. వెంచర్ తరహాలో ప్లాట్లు చేశారు. విద్యుత్ సరఫరా, 20 అడుగులు, 30 అడుగులతో అంతర్గత రోడ్లు, వెంచర్ చుట్టూ ప్రహరీ పనులు పూర్తి చేశారు. ఇక్కడ 828 ఇళ ్లకు మూడు బ్లాక్‌ల్లో 108 పూరయ్యాయి. జీ ప్లస్ 3 పద్ధతిలో చేపట్టిన ఇళ్ల నిర్మాణాల్లో కొన్ని సివిల్ పనులు పూర్తి కాగా, విద్యుత్, ప్లంబింగ్ పనులు కావాల్సి ఉంది. మిగిలిన బ్లాక్‌లు పిల్లర్లు, శ్లాబులు, పునాదుల వరకు పనులు పూర్తయి మొండిగోడలతో దర్శనం ఇస్తున్నాయి. పాల్వంచలో 492 ఇళ్లు మంజూరు కాగా, ఇల్లెందు, మణుగూరు నియోజకవర్గాల్లో, భద్రాచలం పట్టణంలోనూ దాదాపు అంతే ఉన్నాయి. పనులు పూర్తి కాకున్నా.. గత ప్రభుత్వం సాధారణ ఎన్నికల ముందు ఈ ఇళ్లను లాటరీ పద్ధతిలో లబ్ధిదారులకు కేటాయించింది. దీనిపై ఆరోపణలు రావడంతో ఆ ప్రక్రియ ఆగిపోయింది. నాటి నుంచి నేటి వరకు డబుల్ బెడ్ రూం ఇళ్ల పథకం ఎటూ కాకుండా పోతోంది.
బీఆర్‌ఎస్ హయాంలో 2బీహెచ్‌కే పథకం
మధ్యలోనే ఆగిపోయిన ఇళ్ల నిర్మాణాలు
నిరుపయోగంగా వందలాది గృహాలు
హనుమకొండలో ఇటీవల 592 ఇళ్లు లబ్ధిదారులకు అప్పగింత
డబుల్ బెడ్‌రూం ఇళ్ల పథకం కింద చేపట్టిన నిర్మాణాలు ఎందుకూ కొరగాకుండా పోయే ప్రమాదం ఏర్పడింది. రూ.కోట్ల ప్రజాధనం వృథా అయ్యే పరిస్థితి నెలకొంది. హనుమకొండ తరహాలో జిల్లాలో కూడా నిర్మాణం పూర్తయిన 2బీహెచ్‌కే ఇళ్లను లబ్ధిదారులకు కేటాయించడం, అసంపూర్తిగా ఉన్న వాటిపై విధానపరమైన నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉంది.
–సాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం

డబుల్‌పై ధ్యాసేది?