
ప్రతి ఎకరాకూ సాగునీరు
● రూ.630 కోట్లతో 33 వేల ఎకరాల ఆయకట్టు స్థిరీకరణ ● డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క ● మంత్రులు ఉత్తమ్, కోమటిరెడ్డి, పొంగులేటి, వాకిటితో కలిసి జవహర్ లిఫ్ట్ పనులకు శంకుస్థాపన
మధిర: జిల్లాలోని ప్రతీ ఎకరానికి కృష్ణ, గోదావరి జలాలు అందేలా కృషి చేస్తున్నామని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క తెలిపారు. మధిర, ఎర్రుపాలెం మండలాలకు సాగునీరు అందించేందుకు రూ.630 కోట్లతో వంగవీడు సమీపంలో వైరా నదిపై చేపట్టిన జవహర్ ఎత్తిపోతల పథకం పనులకు మంత్రులు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ఉమ్మడి జిల్లా ఇన్‌చార్జి మంత్రి వాకిటి శ్రీహరితో కలిసి ఆదివారం ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా జరిగిన బహిరంగ సభలో భట్టి మాట్లాడుతూ.. నాగార్జున సాగర్ మూడో జోన్‌లో ఉన్న ఆయకట్టుకు రెండో జోన్ నుంచి సాగునీరు అందించాలని ఈ ప్రాంత ప్రజలు పలుమార్లు విజ్ఞప్తి చేశారని తెలిపారు. మధిర ప్రాంతంలో కట్టలేరు, వైరా, మున్నేరు నదులు ప్రవహిస్తున్నా సాగు నీరందడం లేదన్నారు. జవహర్ ఎత్తిపోతల పథకానికి 2012లో మంజూరు ప్రతిపాదనలు సమర్పించామని, గత పాలకులు పదేళ్లలో ఈ ప్రాజెక్టును నిర్లక్ష్యం చేశారని విమర్శించారు. ప్రజా ప్రభుత్వం ఏర్పడ్డాక సర్వే చేసి, నిధులు మంజూరు చేశామన్నారు. పాలేరు నుంచి సత్తుపల్లి వరకు నాగార్జున సాగర్ ఎడమ కాలువ ద్వారానే పంటలు పండుతున్నాయని చెప్పారు.
గేమ్ చేంజర్‌గా ఎత్తిపోతల పథకం..
జవహర్ ఎత్తిపోతల పథకం మధిర ప్రాంతానికి గేమ్ చేంజర్‌గా ఉంటుందని నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. ఏడాది లోపు పనులు పూర్తి చేయాలని ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. జవహర్ ఎత్తిపోతల పథకం ద్వారా 33వేల ఎకరాల ఆయకట్టు స్థిరీకరణ జరుగుతుందని, వైరా నదిలో 120 రోజుల్లో 4 టీఎంసీలు ఎత్తిపోసేలా రూపకల్పన చేశామని తెలిపారు. ఈ ప్రాజెక్టు నిర్మాణానికి 190 ఎకరాల భూ సేకరణ చేయాల్సి ఉంటుందని, ఇందుకోసం రూ.45 కోట్లు కేటాయించామని చెప్పారు. మధిర మండలంలో 13 వేల ఎకరాలు, ఎర్రుపాలెం మండలంలో 19 వేల ఎకరాల ఆయకట్టు స్థిరీకరణ జరుగుతుందని అన్నారు. సీతారామ ఎత్తిపోతల పథకాన్ని పూర్తి చేసి ఉమ్మడి ఖమ్మం జిల్లాకు పుష్కలంగా గోదావరి నది జలాలు తీసుకొస్తామని ప్రకటించారు. మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాట్లాడుతూ.. దిండి, సీతారామ, పాలమూరు, దేవాదుల ప్రాజెక్టులను పూర్తి చేస్తామన్నారు. రూ.1,200 కోట్లతో ఆర్‌అండ్ బీ రోడ్ల నిర్మాణం చేపట్టామని, వంగవీడుకు డబుల్ రోడ్డు వేస్తామని చెప్పారు. ఉమ్మడి జిల్లా ఇన్‌చార్జ్ మంత్రి వాకిటి శ్రీహరి మాట్లాడుతూ.. డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల పేరుతో గత పాలకులు పేదలను మోసం చేశారని, తమ ప్రభుత్వం వచ్చాక ఒక్కో నియోజకవర్గానికి 3,500 ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తున్నామని చెప్పారు. దేశంలో మరే రాష్ట్రంలోనూ లేని విధంగా సన్న ధాన్యం పండించిన రైతులకు గిట్టుబాటు ధరతో పాటు క్వింటాకు రూ.500 బోనస్ ఇస్తున్నామని చెప్పారు. రెవెన్యూ, హౌసింగ్ శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ.. జోన్ 3లో ఉన్న బ్రాంచ్ కెనాల్‌పై మధిర, ఎర్రుపాలెంలో 33 వేల ఎకరాల ఆయకట్టు ఉన్నా నీరందక రైతులు ఇబ్బంది పడ్డారని తెలిపారు. జవహర్ ఎత్తిపోతల పథకంతో ఆంధ్రాతో సంబంధం లేకుండా జోన్ 3 ఆయకట్టును జోన్ 2 పరిధిలోకి తీసుకొస్తామని చెప్పారు. గోదావరి నీటిని పాలేరు తీసుకొచ్చి కృష్ణానది పరీవాహక ప్రాంతంలో ఉన్న 33 వేల ఎకరాలు రెండు పంటలు సాగయ్యేలా ఈ పథకం ఉపయోగపడుతుందని వివరించారు. కార్యక్రమంలో ఖమ్మం కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి, వైరా, సత్తుపల్లి ఎమ్మెల్యేలు రాందాస్‌నాయక్, మట్టా రాగమయి, ఖమ్మం సీపీ సునీల్ దత్, రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్ రాయల నాగేశ్వర రావు, హస్తకళల అభివృద్ధి సంస్థ చైర్మన్ నాయుడు సత్యనారాయణ, డీసీసీబీ చైర్మన్ దొండపాటి వెంకటేశ్వరరావు, ఇరిగేషన్ సీఈ రమేష్ తదితరులు పాల్గొన్నారు.