
రామయ్యకు సువర్ణ పుష్పార్చన
పునఃప్రారంభమైన నిత్యకల్యాణాలు
భద్రాచలం: శ్రీ సీతారామ చంద్రస్వామివారి అంతరాలయంలోని మూలమూర్తులకు ఆదివారం అభిషేకం, సువర్ణ పుష్పార్చన జరిపారు. పవిత్రోత్సవాల సందర్భంగా నిలిపిన నిత్యకల్యాణాలను పునఃప్రారంభించారు. తొలుత తెల్లవారుజామున గర్భగుడిలో స్వామివారికి సుప్రభాత సేవ, సేవాకాలం, ఆరాధన తదితర పూజలు చేశారు. అనంతరం నిత్యకల్యాణానికి స్వామివారిని పల్లకీసేవగా చిత్రకూట మండపానికి తీసుకొచ్చారు. ఆ తర్వాత అర్చకులు స్వామివార్లకు విశ్వక్సేన పూజ, పుణ్యావాచనం చేశారు. కంకణధారణ, యజ్ఞోపవీత ధారణ, అమ్మవారికి కంకణధారణ, యోక్త్రధారణ గావించి నిత్యకల్యాణ ఘట్టాన్ని ఆలయ అర్చకులు శాస్త్రోక్తంగా జరిపారు. భక్తులు స్వామివారి ఆర్జిత సేవల్లో పాల్గొని తీర్థ ప్రసాదాలను స్వీకరించారు. కాగా స్వామివారి దర్శనానికి భక్తులు క్యూ కట్టారు.
రామయ్య సన్నిధిలో
ఏపీ మంత్రి
భద్రాచలం/దుమ్ముగూడెం: భద్రాచలం, పర్ణశాల శ్రీ సీతారామ చంద్రస్వామి వారిని ఆలయాలను ఆంధ్రప్రదేశ్‌కు చెందిన కార్మిక, పారిశ్రామిక, వైద్య సేవల మంత్రి వాసంశెట్టి సుభాష్ తన కుటుంబ సభ్యులతో ఆదివారం దర్శించుకున్నారు. స్వామివారికి పూజలు చేశారు. భద్రాచలం లక్ష్మీతాయారు అమ్మవారి ఉపాలయంలో పండితులు వేదాశీర్వచనం చేసి ప్రసాదాలను అందజేశారు. పర్ణశాలలో పంచవటీ కుటీరం, నారచీరల ప్రాంతాలను సందర్శించారు. పోలీసులు బందోస్తు నిర్వహించారు.
పెద్దమ్మతల్లికి విశేషపూజలు
పాల్వంచరూరల్: పెద్దమ్మతల్లి అమ్మవారికి అర్చకులు విశేష పూజలు నిర్వహించారు. మండలంలోని శ్రీకనకదుర్గ (పెద్దమ్మతల్లి) ఆలయానికి ఆదివారం భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. రాష్ట్రంలోని పలు ప్రాంతాలతోపాటు పొరుగు రాష్ట్రాల నుంచి కూడా భక్తులు వచ్చి అమ్మవారిని దర్శించుకున్నారు. దీంతో ఆలయ ప్రాంగణం కిటకిటలాడింది. భక్తులు అన్నప్రాసనలు, ఒడిబియ్యం, పసుపు కుంకుమలు, చీరలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. పూజా కార్యక్రమంలో ఈఓ ఎన్.రజనీకుమారి, ఆలయ కమిటీ చైర్మన్ బి.నాగేశ్వరరావు, వేదపండితులు పద్మనాభశర్మ, అర్చకుడు రవికుమార్‌శర్మ పాల్గొన్నారు.
నేడు ప్రజావాణి
సూపర్‌బజార్(కొత్తగూడెం): కలెక్టరేట్‌లో సోమవారం నిర్వహించే ప్రజావాణి కార్యక్రమానికి అన్ని శాఖల అధికారులు సకాలంలో హాజరు కావాలని కలెక్టర్ జితేష్ వి.పాటిల్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఉదయం 10.30 గంటలకు ప్రజావాణి ప్రారంభమవుతుందని పేర్కొన్నారు. ప్రజలు తమ సమస్యలను లిఖిత పూర్వకంగా అందజేయాలని కలెక్టర్ కోరారు.

రామయ్యకు సువర్ణ పుష్పార్చన

రామయ్యకు సువర్ణ పుష్పార్చన